Kavitha
Kavitha : ఈ ఏడాది మేలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ పేరుపై కీలక ప్రకటన చేశారు. మే మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీ పేరు ప్రకటిస్తామని, పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని.. నా మొదటి ఛాయిస్ సిద్ధిపేట.. రెండో ఛాయిస్ బోధన్ అని కవిత చెప్పారు.
ఆర్టీసి కార్మికుల సమ్మె విషయంలో బీఆర్ఎస్ పట్టించుకోలేదనే కోపం కార్మికుల్లో ఉంది. బిల్లుల చెల్లింపు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నయం. రెండేళ్లలో ఆర్టీసీలో సింగిల్ పర్మినెంట్ రిక్రూట్మెంట్ లేదని కవిత అన్నారు. ఫ్యూచర్‌లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండదని కవిత సంచలన కామెంట్స్ చేశారు. ప్రధాన ప్రతిపక్షం మేమే అవుతాం.. చూస్తూ ఉండండి అంటూ కవిత అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి మేమే వస్తామని, ప్రయారిటీల ఆధారంగా మేము సమస్యలపై పోరాటం చేస్తున్నామని కవిత చెప్పుకొచ్చారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని కవిత స్పష్టం చేశారు. మా పార్టీ నేతలు మున్సిపాలిటీల్లో గెలిచిన తరువాత వాళ్లకు ఫోన్లు చేసి ఒత్తిడి తెచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ దారిలోనే వెళ్తుంది. కొత్త తరహా రాజకీయం కాంగ్రెస్ చేయడం లేదని కవిత అన్నారు.
నేను పెట్టబోయే పార్టీ వ్యక్తుల మీద నడవదు.. వ్యవస్థల మీద నడవాలి. ప్రాంతీయ పార్టీ లీడర్ సెంట్రిక్ ఉంటుంది. కానీ, వ్యవస్థ నిర్మాణం జరగాలి. సైద్ధాంతిక పునాది ఉండాలని.. ఆ మేరకు పార్టీ నిర్మాణం ఉంటుందని కవిత చెప్పారు.
ఆడవాళ్లు అని అవమానించొద్దు. షర్మిల ఈరోజు ఏపీలో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఇక్కడ ప్రజలకు నచ్చలేదు. చిరంజీవి పార్టీ పెట్టి మూసివేయలేదా..? నా లైన్లో నేను వెళ్తున్నా.. నా ప్రయత్నం నాది. తెలంగాణ వాదమే మా పార్టీ మొదటి లైన్ అని కవిత స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్లు కేంద్ర మంత్రులు అయ్యారు. కొత్త తరానికి పెట్టబోయే పార్టీలో అవకాశం ఉంటుందని కవిత చెప్పారు.