కరీంనగర్….దేశ వ్యాప్తంగా ఈ పేరు మార్మోగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడంలో ఈ జిల్లా దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. కరోనాను కట్టడి చేయడంలో రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా మోడల్‌గా నిలవగా…. ఇపుడు దాన్ని మించిపోయింది. దక్షిణాదిలో కరీంనగర్ జిల్లా రోల్ మోడల్‌గా అవతరించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కరీంనగర్ మోడల్ ఎంతో అనుసరనీయమని ‘ద కన్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ’ తన పరిశోధనలో వెల్లడించింది. కరీంనగర్‌లో అసాధారణ రీతిలో వైరస్‌ను కట్టడి చేశారని తన పబ్లికేషన్‌లో ప్రశంసించింది.
మార్చి 25న ఇండోనేషియాకు చెందిన మత ప్రచారకులు కరీంనగర్‌లో పర్యటించడం ద్వారా కరోనా కలకలం సృష్టించింది. ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని వీరు కరీంనగర్‌లో పర్యటించారు. 10 మంది మత ప్రచారకులను పోలీసులు వెంటనే పసిగట్టి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా వారు ఎక్కడెక్కడ పర్యటించారన్నది 48 గంటలలోనే గుర్తించారు. అంతేకాదు… రైల్వేశాఖతో కలిసి సంపర్క్‌క్రాంతి రైలులో ఇండోనేషియన్స్‌తో పాటు ప్రయాణించిన వారిని అధికారులు అప్రమత్తం చేశారు. వారితో పాటు 73 మంది ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారిని గుర్తించి వారి శాంపిల్స్‌ను టెస్ట్‌లకు పంపారు. వందల మంది సెంకడరీ కాంటాక్ట్ ఉన్నవారిని గుర్తించి ఐసోలేషన్‌కు పంపించారని సీఐఏ తెలిపింది. ఒక్క కరీంనగర్‌లోనే 150 బృందాలను ఏర్పాటుచేసి ఇంటింటి సర్వే చేయించిందని సీఐఐ వివరించింది.
జిల్లా అధికార యంత్రాంగం వైరస్ బారినపడ్డవారితో పాటు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ఉన్న ఇళ్లను గుర్తించి 8 వేల సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి డ్రోన్ల ద్వారా నిఘా పెట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1,000 పడకలతో ప్రత్యేక వార్డులను, 225 ఐసీయూ పడకలను ఏర్పాటు చేసిందని సీఐఐ తెలిపింది. 6 వేల ఇళ్లలో జ్వరం లక్షణాలేమైనా ఉన్నాయా అని పరీక్షలు జరిపింది. పాజిటివ్ కేసులను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు సీఐఐ వెల్లడించింది. కరీంనగర్‌లో మూడు, హుజూరాబాద్‌లో నాలుగు కంటెయిన్‌మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ శశాంక నిరంతర పర్యవేక్షణతో అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించారని ప్రశంసించింది.
తెలంగాణలోనే తొలిసారిగా అత్యధిక కరోనా ప్రభావిత జిల్లాగా కరీంనగర్ నిలిచింది.19 పాజిటివ్ కేసులు నమోదు కాగా…15 మందిని డిశ్చార్జ్ చేశారు. నాలుగు యాక్టివ్ కేసులతో పాటు మరో ఏడుగురిని క్వారంటైన్‌లో ఉంచారు. 164 మంది అనుమానితులను హోమ్ క్వారంటైన్‌లో ఉంచడం జరిగింది. ఇలాంటి స్థితిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో కేసీఆర్ ప్రభుత్వం, కరీంనగర్ అధికార యంత్రాంగం విజయవంతమైందని సీఐఐ కితాబిచ్చింది. జనతా కర్ఫ్యూకు ముందే పట్టణంలో లాక్‌డౌన్ విధించి, శానిటేషన్, అనుమానిత వ్యక్తుల క్వారంటైన్, కమ్యూనిటీ ట్రాన్స్‌మిట్ కాకుండా వైరస్‌ను కట్టడి చేసి కరీంనగర్ రోల్‌మోడల్‌గా నిలిచిందని సీఐఐ వెల్లడించింది.