KTR : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు..? కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఏం చెప్పారంటే
KTR Jubilee Hills by election : బీహార్ రాష్ట్రంలో ఎన్నికలతో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు.

KTR Jubilee Hills by election
KTR Jubilee Hills by election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థిని ఆ పార్టీ అధిష్టానం ఫైనల్ చేసినట్లు సమాచారం. తాజాగా.. తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని రెహమత్ నగర్ డివిజన్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే విషయంపై కీలక కామెంట్స్ చేశారు.
బీహార్ రాష్ట్రంలో ఎన్నికలతో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలు జరిగే చాన్స్ ఉంది. నవంబర్ నెలలో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాగంటి సునీతకు అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాం. ఉప ఎన్నికల్లో 30వేల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించాలి. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలిచి తీరాల్సిందేనని కేటీఆర్ పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు.
అయితే, బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే విషయంపై త్వరలోనే పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటిస్తారని కేటీఆర్ చెప్పారు. ఇదిలాఉంటే.. బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
కేటీఆర్ మాట్లాడుతూ.. సర్దార్ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు గోపీనాథ్ అండగా ఉన్నారు. ఈరోజు గోపీనాథ్ కుటుంబానికే కష్టం వచ్చింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్ళు కూలగొట్టడమా..? అంటూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూకట్‌పల్లిలో ఇల్లు కులగొడతామని స్టిక్కర్ వేయడంతో బుచ్చమ్మ అనే వృద్ధ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ ఇల్లు మీరు కూలగొట్టుకున్న వాళ్ళు అవుతారని కేటీఆర్ సూచించారు. మాదాపూర్‌లో ఉండే రేవంత్ రెడ్డి, ఆయన బ్రదర్ తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా వెళ్ళదు. పేదోళ్ల ఇంటికి మాత్రం హైడ్రా వెళ్తుంది అంటూ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వినాయక నిమజ్జనం రోజు సచివాలయం దగ్గర కేసీఆర్ పాటలతో హోరెత్తించారు. బతుకమ్మ పండుగకి జోర్దార్ పాటలు రాబోతున్నాయి. గల్లీ గల్లీలో బతుకమ్మ పాటలు దద్దరిల్లాలి అంటూ కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు.