తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాజీనామా చేశారు. ప్రగతి భవన్ నుంచే తన రాజీనామాను రాజ్ భవన్ కు కేసీఆర్ పంపినట్లు సమాచారం. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి నేరుగా కారులో ఫాం హౌజుకు వెళ్లినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గవర్నర్ తమిళిసై అపాయింట్మెంట్ కేసీఆర్ అడిగారు. కానీ దానికి గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రగతి భవన్ నుంచే తన రాజీనామాను పంపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా 2014 నుంచి పదేళ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని భారత్ రాష్ట్ర సమితి ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ 60కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. కాగా, కేసీఆర్ రాజీనామా అందినట్లు రాజ్ భవన్ వర్గాలు ఆదివారం సాయంత్రం వెల్లడించాయి.