Himanshu Rao Kalvakuntla: కేసీఆర్ మ‌న‌వ‌డికి ప్రతిష్టాత్మక అవార్డు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షును ప్ర‌తిష్టాత్మ‌క డ‌యానా అవార్డు వచ్చింది.

Kcr Grand Son

Kcr Grand Son: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షును ప్ర‌తిష్టాత్మ‌క డ‌యానా అవార్డు వచ్చింది. ఈ విషయాన్ని హిమాన్షు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. SHOMA అనే కార్య‌క్ర‌మాన్ని విజ‌యవంతంగా నిర్వహించినందుకు త‌న‌కు ఈ అవార్డు వ‌చ్చిన‌ట్లు హిమాన్షు ట్విట‌ర్‌లో చెప్పారు. గ్రామాలను స్వ‌యం స‌మృద్ధి సాధించే దిశ‌గా తీసుకెళ్ల‌డ‌మే ఈ కార్య‌క్ర‌మ ల‌క్ష్యం.

ఈ అవార్డు త‌న‌కు ద‌క్క‌డం ప‌ట్ల చాలా సంతోషంగా ఉన్న‌ట్లు ట్వీట్‌లో హిమాన్షు అన్నారు. ఈ కార్య‌క్ర‌మం విజ‌యవంతం కావ‌డంలో త‌న‌కు మార్గ‌ద‌ర్శ‌కుడిగా నిలిచిన త‌న తాత‌, సీఎం కేసీఆర్‌కు ఈ సంద‌ర్భంగా కృతజ్ఞ‌త‌లు తెలిపారు హిమాన్షు. ఈ సంథర్భంగా గంగాపూర్‌-యూసుఫ్‌ఖాన్‌ప‌ల్లి వాసుల‌కు, త‌న గురువుల‌కు కూడా ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.

తొమ్మిది సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి ఇచ్చే ఈ అవార్డు.. సమాజంలో మార్పు కోసం మానవీయ దృక్పథంతో చేసే పనులకి ఇస్తారు. 25 ఏళ్ల కింద‌ట మ‌ర‌ణించిన వేల్స్ యువ‌రాణి డ‌యానా పేరు మీదుగా ఈ అవార్డు ఏర్పాటు చేశారు. ఆహార ఉత్ప‌త్తుల్లో క‌ల్తీ అంశంపై గ్రామీణుల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతోపాటు క‌ల్తీ లేని ఉత్ప‌త్తుల‌ను చేయ‌డంలో వాళ్లు సాధికార‌త సాధించే దిశగా ప్రోత్స‌హించ‌డ‌మే SHOMA కార్య‌క్ర‌మ ప్ర‌ధాన ఉద్దేశం.