Khairatabad By Election : దానంపై వేటు.. అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు.. టికెట్ దక్కేదెవరికి.?
Khairatabad BRS Ticket Race : దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగడం దాదాపు ఖాయమైంది. దీంతో టికెట్ కోసం బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
- Harish Thanniru
- Published on- September 20, 2026 / 01:31 PM IST
Khairathabad BRS Ticket Race
Khairatabad BRS Ticket Race : దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగడం దాదాపు ఖాయమైంది. బీఆర్ఎస్‌లో అప్పుడే ఖైరతాబాద్ బైపోల్‌పై చర్చ మొదలైంది. నిన్నటి వరకు దానం నాగేందర్‌పై పోరాటం చేసిన బీఆర్ఎస్..ఇప్పుడు అదే సీటును తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కసరత్తు స్టార్ట్ చేస్తోంది. అందుకే..అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగులు వేయాలని డిసైడ్ అయింది గులాబీ పార్టీ అధిష్టానం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌లో ఖైరతాబాద్ టికెట్ ఆశిస్తున్న నేతలు.. ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు బిజీ అయిపోయారట.
Also Read : CM Revanth Reddy : తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన విష్ణుకు..నియోజకవర్గంతో ఉన్న పాత పరిచయాలు, పీజేఆర్ కుటుంబానికి ఉన్న రాజకీయ అనుబంధం తమకు కలిసొస్తుందని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఖైరతాబాద్‌కు బైపోల్ వస్తే విష్ణువర్ధన్ రెడ్డిని బరిలో దింపే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు కూడా ఎప్పటినుంచో ప్రచారం ఉంది.
గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేరు కూడా టికెట్ రేసులో వినిపిస్తోంది. గతంలో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన శ్రవణ్..ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. నియోజకవర్గంతో ఉన్న అనుబంధంతో పాటు..బీసీ సామాజిక సమీకరణాలు కూడా తనకు అనుకూలంగా మారుతాయని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరో నేత తలసాని సాయికిరణ్ పేరు ఈ రేసులోకి రావడం మరింత ఆసక్తి రేపుతోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్ కూడా ఖైరతాబాద్ టికెట్ ఆశిస్తున్నట్లు టాక్.
ఉపఎన్నిక రాబోతుందని ప్రచారం నడుస్తున్నప్పటి నుంచి సాయికిరణ్‌ను బరిలోకి దింపాలని తలసాని ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం నడిచింది. సంక్రాంతి సందర్భంగా ఖైరతాబాద్ పరిధిలో జరిగిన కార్యక్రమాల విషయంలోనూ తలసాని, దానం వర్గాల మధ్య పోటాపోటీ కనిపించిందన్న చర్చ అప్పట్లో జరిగింది. దీంతో ఖైరతాబాద్ ఉపఎన్నికలో తనయుడు సాయికిరణ్‌ను పోటీ చేయించేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారన్న టాక్ వినిపిస్తోంది. తలసాని సాయికిరణ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయారు.
మరోవైపు పార్టీ కోసం చాలాకాలంగా పనిచేస్తున్న మన్నె గోవర్ధన్ రెడ్డి పేరు కూడా మరోసారి తెరపైకి వచ్చింది. 2014లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన మన్నె..2018, 2023లో దానం నాగేందర్‌కు అవకాశం ఇవ్వడంతో సీటు త్యాగం చేసి సహకరించారని ఆయన వర్గం చెబుతోంది. విష్ణువర్ధన్‌రెడ్డి..దాసోజు..సాయికిరణ్..మన్నె గోవర్ధన్‌రెడ్డి.. నలుగురి పేర్లు ఇప్పుడు ప్రచారంలో ఉన్నప్పటికీ..ఇక్కడే బీఆర్ఎస్ అసలు కసరత్తు మొదలుపెడుతుందట. ఎవరికి స్థానికంగా బలం ఉంది.? క్యాడర్‌ను నడిపించే సామర్థ్యం ఉన్న లీడర్లు ఎవరు.? సామాజిక సమీకరణాలు ఏంటి.? కాంగ్రెస్ అభ్యర్థిని ఢీకొట్టేందుకు ఎవరైతే సరైన అభ్యర్థి.? ఇలాంటి అంశాలన్నింటినీ పరిశీలించాకే అభ్యర్థిని ఫైనల్ చేయాలని గులాబీ అధిష్టానం భావిస్తోందన్న చర్చ జరుగుతోంది.
గత బైపోల్స్ అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకుని..చివరి నిమిషం వరకు అభ్యర్థి ఎంపికపై సర్వేలు, ఫీడ్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత రెండు బైపోల్స్‌లోనూ అభ్యర్థి విషయంలో చేసిన పొరపాటు ఈ సారి చేయకూడదనే పట్టుదలతో ఉంది గులాబీదళం. ఎమ్మెల్యేల మృతితో వచ్చిన ఎన్నికలు కావడంతో కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌లో అనివార్యంగా వారి కుటుంబసభ్యులకే టికెట్ ఇవ్వాల్సి వచ్చిందని..ఈ సారి గెలుపు గుర్రాన్నే ఎంపిక చేసుకునే అవకాశం ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది.
కేటీఆర్ ఇప్పటికే దానం నాగేందర్ అనర్హతపై స్పందిస్తూ.. ఖైరతాబాద్ ఉపఎన్నికలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలకూ ఇదే గతి పడుతుందన్నారు. దీంతో బీఆర్ఎస్‌కు ఖైరతాబాద్ బైపోల్ కేవలం మరో ఎన్నిక కాదనే చర్చ మొదలైంది. ఖైరతాబాద్‌లో గెలిచి అధికార పార్టీకి, జంపింగ్ ఎమ్మెల్యేలకు ఝలక్ ఇవ్వాలని కసి మీదుందట బీఆర్ఎస్. అందుకే క్యాండిడేట్ సెలక్షన్స్ విషయంలో ఒక్క చిన్న తప్పిదం కూడా చేయకూడదని గులాబీ పార్టీ భావిస్తున్నట్లు టాక్. ఖైరతాబాద్ బరిలో దిగే గులాబీ అభ్యర్థి ఎవరన్నది నోటిఫికేషన్ వస్తే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు.
