Telangana Congress : కొండా సురేఖపై వేటుకు రంగం సిద్ధమైందా..? సీఎం రేవంత్ వర్గం బిగ్ ప్లాన్? ఏం జరగబోతుంది..
Konda Surekha Daughter Issue : మంత్రి కొండా సురేఖ సొంత కూతురు ఏకంగా సీఎంను టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడితే.. మంత్రిగా ఉన్న కొండా సురేఖ కనీసం ఖండించకపోగా.. తనకేం సంబంధం అంటూ రిప్లయ్ ఇవ్వడంపై రేవంత్ వర్గీయులు మండిపడుతున్నారు.
- Harish Thanniru
- Published on- August 22, 2026 / 01:22 PM IST
Konda Surekha Daughter konda susmita patel Issue
Konda Surekha Daughter Issue : ఎస్.. ఇట్స్ టైమ్ టు కైమాక్స్. జరగాల్సిన రచ్చ అంతా జరిగిపోయింది. ఒకటి రెండు కాదు.. నాలుగైదు ఇష్యూస్ అయిపోయాయి. సర్దిచెప్పాం.. సర్దుకుపోయాం. కొండా సురేఖ విషయంలో ఇక ఎంతమాత్రం ఉపేక్షించాల్సిన పనిలేదంటున్నారు హస్తం పార్టీ నేతలు. ఏకంగా సీఎం రేవంత్, అతని సోదరులను ఉద్దేశించి కొండా కూతురు సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏకంగా సీఎం రేవంత్ ఇగోను టచ్ చేసేలా సుస్మిత మాట్లాడారని పార్టీలోనే చర్చ జరుగుతోంది.
సుస్మిత కామెంట్స్‌పై క్రమశిక్షణ కమిటీ నోటీసులకు కొండా సురేఖ ఇచ్చిన రిప్లైపై కూడా పార్టీ పెద్దలు సంతృప్తి చెందలేదట. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఎన్నడూలేని విధంగా దాదాపు 25మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియా ముందుకు వచ్చి డైరెక్ట్‌గా సీఎం రేవంత్ మనసులో ఉన్న ఆలోచనను బహిరంగం చేశారు. క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తప్పుపట్టారు. కాంగ్రెస్ శాసనసభాపక్షంలో ఏకంగా 25 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్ పెట్టారు.
మంత్రి కొండా సురేఖ సొంత కూతురు ఏకంగా సీఎంను టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడితే.. మంత్రిగా ఉన్న కొండా సురేఖ కనీసం ఖండించకపోగా.. తనకేం సంబంధం అంటూ రిప్లయ్ ఇవ్వడం ఏంటంటూ మండిపడ్డారు. ప్రభుత్వ అధినేతగా ఉన్న సీఎంను బలహీనపరిచే కుట్ర జరుగుతుందని ధ్వజమెత్తారు. పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. పార్టీ అధిష్టానానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు.
సొంత కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి సురేఖ బహిరంగ క్షమాపణచెప్పాలని అంటోంది రేవంత్ వర్గం. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. సీఎంను బలహీన పరిచాలనే ప్రతిపక్షాల కుట్రకు.. కొండా సురేఖ అండగా నిలుస్తోందని విమర్శించారు. అంతేకాదు ఆమె వెనుక తమ పార్టీలోని కొన్ని గుంటనక్కలున్నాయంటూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు కాకపుట్టిస్తోంది. రేవంత్‌కు వ్యతిరేకంగా ఒకరిద్దరు మంత్రులతో పాటు.. పీసీసీ చీఫ్ వ్యవహరిస్తున్నారనే ప్రచారం గత కొద్దిరోజులుగా కాంగ్రెస్‌లో సాగుతూ వస్తోంది. దీంతో రేవంత్ బ్యాచ్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న గుంటనక్కలు వారేనా అనే మరో చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే చర్యలు ఎవరు చేసినా ఊరుకునేది లేదని.. కులంతో సంబంధం లేకుండా నష్టం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కులాన్ని అడ్డుపెట్టుకొని ఏం మాట్లాడిన చెల్లుతుందని అనుకుంటే సరికాదన్నారు. పార్టీ నుంచి బహిష్కరించకముందే రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు.
కొండా సురేఖను ముందుగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే వాదనను బలంగా వినిపించారు. ఇలా సీఎం రేవంత్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో కొండా సురేఖ తీరుపై ఒకే వేదికపైకి రావడం ఆసక్తికరంగా మారింది. పార్టీ అధిష్టానం కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందేనని పట్టుబట్టడం చర్చనీయాంశం అవుతుంది. సురేఖపై చర్యలకు పట్టుబడుతూ ఎమ్మెల్యేలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళనలు చేస్తున్నారు. కొండా సురేఖపై కచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందేనంటున్నారు. ఒక రకంగా సీఎల్పీ వేదికగా సీఎం రేవంత్ వర్గం బలప్రదర్శన చేస్తూ..పార్టీ హైకమాండ్‌కు సంకేతాలు పంపించింది. ఇదే అదునుగా మిగతా నేతలకు కూడా గట్టి ఇండికేషన్ పంపించాలని చూస్తున్నారట. అందుకే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డికి కూడా పనిలో పనిగా కౌంటర్ ఇచ్చారని అంటున్నారు. ప్రభుత్వాన్ని, పార్టీని బలహీనపరిచేలా ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటోంది రేవంత్ వర్గం.
నియోజకవర్గాల్లో నేతల ఇంటర్నల్ ఫైట్ అంటే చూసీ చూడనట్లు వెళ్లిపోయారు. కానీ కొండా సురేఖ కూతురు సీఎంను నేరుగా టార్గెట్ చేయడం..ఏకంగా అల్టిమేటం జారీ చేయడంతో..వివాదం కాస్త ముదిరిపాకాన పడింది. దాదాపు 25 మంది రేవంత్ వర్గం ఎమ్మెల్యేలు కొండా సురేఖను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలనే సింగిల్ లైన్ డిమాండ్‌ను న్యూస్ హెడ్‌లైన్‌గా మార్చేశారు. ఎమ్మెల్యేల డిమాండ్‌కు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా.? అనేది హాట్ టాఫిక్‌గా మారింది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ద్వారా నోటీసులు సర్వ్ చేసేందుకు అధిష్టానం ఓకే చెప్పడంతో..బర్తరఫ్‌కు కూడా అబ్జక్షన్స్ చెప్పకపోతే.. సీఎం లండన్ నుంచి రాగానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయితే బీసీ సామాజికవర్గం లీడర్. పైగా బలమైన మున్నూరు కాపు, పద్మశాలి సామాజికవర్గం నేతలుగా రెప్రెజెంట్ చేస్తున్న కొండా దంపతులపై యాక్షన్ తీసుకుంటే .. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో లాభమెంత.? నష్టమెంత.? అనే లెక్కలు వేసుకుంటున్నారట హస్తం పార్టీ పెద్దలు. ఏదో సారీ చెప్పించి సమస్యను సాల్వ్ చేద్దామనుకుంటే ఇప్పటికే పలుసార్లు కొండా సురేఖ పార్టీకి, సీఎంకు చిక్కులు తెచ్చిపెట్టడంతో..ఈ సారి ఉపేక్షిస్తే..ప్రజలకు, క్యాడర్‌కు రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయని భావిస్తున్నారట. సో బర్తరఫ్ చేస్తారో.. లేక మరేదైనా వేటు వేస్తారో ఇప్పటికైతే క్లారిటీ లేదు కానీ.. కొండా సురేఖపై ఒకట్రెండు రోజుల్లో ఏదో ఒక యాక్షన్ పక్కా అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు.
