Hyderabad CP Kothakota Srinivas Reddy
Hyderabad CP Kothakota Srinivas Reddy : హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటల్‌లో బాధ్యతలు స్వీకరించారు. శ్రీనివాస్ రెడ్డి గతంలో గ్రేహౌండ్స్, అక్టోపస్‌లో పనిచేశారు. శ్రీనివాస్ రెడ్డికి ముక్కుసూటి అధికారి అనే పేరుంది.
బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతు..డ్రగ్స్ రహిత నగరంగా హైదరాబాద్‌ను నిలబెడతామని తెలిపారు. తన శక్తి సామర్థ్యాలు గురించి తెలిసి సీపీగా బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా మీడియా ఉంటుందని..ప్రజాభిప్రాయాన్ని తమకు మీడియా ద్వారా తెలియజేయాలని కోరారు. ఏదైనా ఘటన జరిగితే పోలీసులు అత్యంత వేగంగా స్పందించటం చాలా అవసరమన్నారు.మహిళలపై వేధింపులు, ర్యాగింగ్‌లను అరికట్టేందుకు షీ టీమ్స్ ద్వారా మరింతగా పనిచేస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగరాన్ని డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చి దిద్దాలని ప్రభుత్వం ఆదేశించిందని..దీని కోసం హైదరాబాద్,సైబరాబాద్, రాచకొండ కమిషనర్లతో సమన్వయం చేసుకొని ముందుకు వెళతామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన డ్రగ్స్ ముఠాలను సీరియస్ హెచ్చరించారు. ‘‘హైదరాబాద్, తెలంగాణను వదిలి డ్రగ్స్ ముఠాలు వెళ్లిపోవాలి..లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాం‘‘ అని హెచ్చరించారు.
సినీ ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించామని..మత్తుపదార్ధాలు తీసుకోవటం మానివేయాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సిని పరిశ్రమకు సంబంధించిన పెద్దలతో త్వరలో మీటింగ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు.అలాగే..పబ్బులు,రెస్టారెంట్లపై నిఘా ఉంటుందన్నారు.ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఈ మధ్య అవహేళనకు గురైందని..అందరితోను ఫ్రెండ్లీ ఉండడం కూడా నష్టమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని గౌరవించే వారితో తాము ఫ్రెండ్లీ గానే ఉంటాం..కానీ చట్టాలను ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.