ఆదివారం(డిసెంబర్ 29,2019) ట్విట్టర్‌లో #AskKTR పేరుతో నెటిజన్లతో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం
ఆదివారం(డిసెంబర్ 29,2019) ట్విట్టర్‌లో #AskKTR పేరుతో నెటిజన్లతో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలంగాణ, ఏపీలతో పాటు దేశ రాజకీయలు, ఇతరత్రా అంశాలపై నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ జవాబులు ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి, ప్రాజెక్టులు, కంపెనీలు, పాతబస్తీకి మెట్రో, వరంగల్ మాస్టర్ ప్లాన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
2020లో హైదరాబాద్ లో పూర్తయ్యే ప్రాజెక్టులు:
అంతర్జాతీయ స్థాయి తయారీ రంగ కంపెనీల నుంచి హైదరాబాద్ కు పెట్టుబడులు తీసుకొస్తామని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్, ఫుడ్ ప్రాసెసింగ్‌లో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని తెలిపారు. 2020లో ఫార్మా సిటీ ప్రారంభమవుతుందన్నారు. హైదరాబాద్ లో రెండో దశ టీ హబ్-టీవర్క్స్ 2020 మొదటి అర్ధ సంవత్సరంలో, జూన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతాయన్నారు. 4వ పారిశ్రామిక విప్లవం దిశగా ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసుకుంటున్నాయని, ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇన్నొవేషన్, ఇన్‌ఫ్రా స్ట్రక్చర్, ఇన్ క్లూజివ్ గ్రోత్ అనే త్రీ ఐ మంత్రాన్ని పాటిస్తోందని, పట్టణాభివృద్ధితో పాటు మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
పాతబస్తీకి మెట్రో.. గచ్చిబౌలికి BRTS:
హైదరాబాద్‌లో బీఆర్‌టీఎస్ (బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్)లో కూకట్‌పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలను కలిపే ప్రణాళిక ప్రారంభమైందని కేటీఆర్ తెలిపారు. పాతబస్తీకి కూడా మెట్రో రైలు సౌకర్యం వస్తుందన్నారు. హైదరాబాద్ తూర్పు వైపు ఐటీ పరిశ్రమలను తీసుకెళ్లాలని తాము చేస్తున్న ప్రయత్నానికి మంచి స్పందన వస్తోందన్నారు. గోపనపల్లిలో విస్తృతంగా పెరుగుతున్న పలు గేటెడ్ కమ్యూనిటీలకు ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ నుంచి రోడ్డు లేదని, దీన్ని నూతన స్లిప్ రోడ్డు నిర్మాణంలో కవర్ చేస్తామన్నా రు.
2020 జనవరిలో వరంగల్‌కు మాస్టర్‌ప్లాన్:
నూతన మున్సిపల్ చట్టంతో పౌరులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని కేటీఆర్ అన్నారు. మున్సిపల్ అధికారుల విచక్షణతో సంబంధం లేకుండా ప్రజల అవసరాలు తీరుతాయని, ఈ మార్పులను వ్యవస్థీకృతం చేసేందుకు నూతన చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో డంప్ యార్డులు, వేస్టు టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ జనవరి మొదటి వారంలో ఉంటుందన్నారు.
టూరిస్ట్ డెస్టినేషన్ గా హైదరాబాద్:
హైదరాబాద్‌ను టూరిస్ట్ డెస్టినేషన్‌గా మార్చేందుకు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించామని కేటీఆర్ తెలిపారు. చార్మినార్, గోల్కొండలకు ప్రపంచ వారసత్వ హోదా సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. యూరప్, అమెరికా వంటి ప్రాంతాల నుంచి మరిన్ని ఎక్కువ విమాన సర్వీసుల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని, అవసరమైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. హైదరాబాద్‌లో నూతనంగా 50 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్ నిర్మాణాలకు ఆమోదం తెలిపామన్నారు.