Ktr: అలా చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

KTR challenges Revanth Reddy regarding the six guarantees announced by the Congress party.

  • రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్.
  • కాంగ్రెస్ హామీల వైఫల్యం.
  • బీఆర్‌ఎస్ గెలుపు ఖాయం.

Ktr: వికారాబాద్‌ జిల్లా పరిగిలో జరిగిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల అవగాహన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) ముఖ్యఅతిథిగా హాజరై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీ ప్రకారం రాష్ట్రంలోని కోటీ 67 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.1.50 లక్షల చొప్పున జమ చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పి, కనీసం తులం ఇనుము కూడా ఇవ్వలేదని రేవంత్‌ సర్కార్‌ను ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, 30 నెలలైనా పూర్తి చేయలేకపోయారని దుయ్యబట్టారు.

Thalliki Vandanam: తల్లుల ఖాతాల్లోకి రూ.13 వేలు.. ‘తల్లికి వందనం’ డేట్ ఫిక్స్ చేసిన ఏపీ ప్రభుత్వం

రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాల అమలులో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో సక్రమంగా సాగిన రైతుబంధు, ఇప్పుడు కేవలం ఓట్ల కోసమే వస్తోందని, ఇప్పటికే మూడుసార్లు రైతుబంధును ఎగ్గొట్టారని మండిపడ్డారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న పీసీసీ అధ్యక్షుడి నాటి హామీ నేటికీ నెరవేరలేదని విమర్శించారు. అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని చెప్పి, ఇప్పుడు పరిగిలో భూములను గుంజుకుంటున్నారని ఆరోపించారు. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని నిప్పులు చెరిగారు.

రాబోయే ఎన్నికలు ధర్మయుద్ధంలా సాగాలని, అయితే కాంగ్రెస్, బీజేపీలు దొంగ ఓట్లను నమ్ముకున్నాయని కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ ఓటమికి 15 వేల దొంగ ఓట్లే కారణమని, ఇప్పుడు కూడా బీఆర్‌ఎస్‌ ఓటర్లను గల్లంతు చేసే ప్రమాదం ఉన్నందున బీఎఎల్ఏలు ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిజాయితీ గల ఓటర్లతో మళ్లీ బీఆర్‌ఎస్‌ గెలుపు, కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.