BRS Working President KTR
KTR : ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. కేటీఆర్ పై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పింది. 10 రోజుల వరకు (ఈ నెల 30) కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 30వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది న్యాయస్థానం. కాగా, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు దర్యాఫ్తు జరగాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కేటీఆర్ ను ఏ-1గా చేర్చారు. దీంతో రేపో మాపో కేటీఆర్ అరెస్ట్ అవుతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కేటీఆర్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించినట్లైంది. మరో 10 రోజుల వరకు (ఈ నెల 30వరకు) కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం లేదని చెప్పొచ్చు.
హైకోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో కేటీఆర్ పై కేసు పెట్టారని, అక్టోబర్ 2023లో ఘటన జరిగితే.. ఇప్పుడు కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరిగిన చర్య అన్నారు. ఇందులో కేటీఆర్ కు లాభం జరిగినట్లు ఎక్కడా లేదన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని చెప్పారు, కానీ అందులో అదేమీ లేదన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ కు ఎలాంటి లబ్ది జరగలేదని, కేవలం రాజకీయ కక్ష సాధింపేనని కేటీఆర్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
అదే సమయంలో ప్రాధమిక విచారణ కూడా జరక్కుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. కేటీఆర్ కు లబ్ది చేకూరినట్లు ఎలాంటి ఆధారం లేకున్నా.. ఆయనను ఏ-1గా పేర్కొన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏ కంపెనీకి అయితే నిధులు మళ్లించారని ఆరోపిస్తున్నారో.. ఆ కంపెనీని అసలు ఎఫ్ఐఆర్ లోనే పేర్కొనలేదన్నారు. లండన్ కంపెనీకి రూ.55 కోట్ల నిధులు మళ్లించారని ప్రధాన అభియోగం. కానీ లండన్ కంపెనీ ఎఫ్ఈవో పేరు ఎక్కడా ఎఫ్ఐఆర్ లో పేర్కొనలేదని కేటీఆర్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
Also Read : కేటీఆర్ అరెస్ట్ జరిగితే బీఆర్ఎస్ ను లీడ్ చేసేదెవరు? కారు స్టీరింగ్ ఆ ఇద్దరిలో ఎవరికి..?