ఈ జిల్లాల వారికి శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్లు మీ సొంతం కాబోతున్నాయ్..
వారంలోపే వెరిఫికేషన్ పూర్తి చేయాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
Indiramma Housing: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సీయూఆర్ఈ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో భూమి ఉన్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఉగాదికి ముందే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు కృషి చేస్తున్నారు.
ఈ మూడు జిల్లాలు, జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేశారు. అందులో 18,000 మంది అర్హులుగా గుర్తించారు. ఈ దరఖాస్తులపై మళ్లీ వెరిఫికేషన్ జరగనుంది. వారంలోపే వెరిఫికేషన్ పూర్తి చేయాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
కమిషనర్లు ఆర్వీ కర్ణన్, వినయ్ కృష్ణ రెడ్డి, సృజన సూచనల మేరకు మూడు కమిషనరేట్ల సిబ్బంది వెరిఫికేషన్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు మరో 28,000 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందిస్తారు. జంట నగరాల్లో చివరి దశకు చేరిన ఇళ్లను సొంత భూమి లేక, సొంత ఇల్లు లేక జీవిస్తున్న పేద కుటుంబాలకు కేటాయిస్తారు. మార్చి 31 లోపు కేటాయింపు పూర్తి చేయాలని మంత్రి జిల్లా కలెక్టర్లు, కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు.
రోడ్లు, తాగునీరు, పాఠశాలలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా స్పష్టం చేశారు. మొత్తం మీద వచ్చే నెల చివరికి సీయూఆర్ఈ పరిధిలో 50,000 మందికి గృహాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
జీహెచ్ఎంసీలో భారీగా దరఖాస్తులు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 3 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో 2.5 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. వచ్చే నెల చివరికి లక్ష ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జీహెచ్ఎంసీ వెలుపల ఇతర మునిసిపల్ కార్పొరేషన్లు, పట్టణ ప్రాంతాల్లో కూడా నిర్మాణం కొనసాగుతోంది.
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లక్ష 13 వేల ఇళ్లు మంజూరు చేసింది. అయితే జీహెచ్ఎంసీ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 12 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో భూమి ఉన్నవారు కేవలం 18,000 మంది మాత్రమే.
