KTR : షెల్ కంపెనీల బాగోతం బయటపెడతాం.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
KTR : రూ. 200 కోట్ల విలువ చేసే స్థలాన్ని రూ. 7 వేల కోట్లకి కేటాయించారని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. రాష్ట్ర గవర్నర్ నీ కలిసి దీనిపై విచారణ జరపాలని కోరతామని కేటీఆర్ పేర్కొన్నారు.
- Sreehari A
- Updated on- August 11, 2026 / 03:54 PM IST
KTR Slams Revanth Govt
- ఆ కంపెనీకి వేల కోట్ల భూములు కేటాయింపు
- 200 కోట్ల విలువ చేసే స్థలాన్ని 7 వేల కోట్లకి కేటాయించారు
- రేవంత్ షెల్ కంపెనీల బాగోతాన్ని బయట పెడతాం
- 74 లక్షల ఓట్లు తొలగించబోతున్నారనేది ఆందోళనకరం
KTR : తెలంగాణ రాజకీయాల్లో భూ కేటాయింపులు, కంపెనీల వ్యవహారం, ఓటర్ల జాబితా అంశాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి రేవంత్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తున్న కంపెనీలకు భూముల కేటాయింపులపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారాలపై వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే గవర్నర్‌ను కలిసి విచారణ కోరుతామని కేటీఆర్ తెలిపారు.
టెస్రాక్ట్ సంస్థపై ఆరోపణలు :
టెస్రాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ సంస్థకు రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండల్ రెడ్డితో సంబంధం ఉందని కేటీఆర్ ఆరోపించారు. కొండల్ రెడ్డిని సంస్థ చైర్మన్‌గా పేర్కొంటూ సమాచారం ఉందని ప్రస్తావించారు. సంస్థతో సంబంధం లేదని మంత్రి శ్రీధర్‌బాబు ఎలా చెబుతారని ప్రశ్నించారు. తక్కువ మూలధనంతో ఏర్పడిన ఉద్యోగులు లేని సంస్థకు భారీ స్థాయిలో భూములు కేటాయించారని కేటీఆర్ ఆరోపించారు.
Read Also : SIR Enumeration : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. SIR ఎన్యూమరేషన్‌లో కీలక గణాంకాలివే!
సుమారు రూ.200 కోట్ల విలువైన స్థలాన్ని రూ.7 వేల కోట్ల విలువకు కేటాయించారంటూ ఆయన ఆరోపించారు. అమెరికాలో జరిగిన సమావేశాల్లో కొండల్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధిగా ఎలా పాల్గొన్నారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాలకు ఏ హోదాలో హాజరవుతున్నారో కూడా వెల్లడించాలని కోరారు.
షెల్ కంపెనీల బాగోతం బయటపెడతాం :
షెల్ కంపెనీల వ్యవహారాన్ని త్వరలో బయటపెడతామని కేటీఆర్ అన్నారు. భూ కేటాయింపుల అంశాన్ని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణపై కూడా కేటీఆర్ స్పందించారు. భారీ సంఖ్యలో ఓట్లు తొలగించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే GRMB మీటింగ్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, రైతుల సమస్యలపైనా కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
