టీపీసీసీ మార్పునకు, క్యాబినెట్ విస్తరణకు మధ్య లింక్..?

New TPCC chief: బీసీ సామాజికవర్గం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్

Revanth Reddy

పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో మార్పులు, చేర్పులకు వేళ అయింది. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో మార్పులకు శ్రీకారం చుట్టాలని భావిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ఇప్పటికే ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి అధిష్టానంతో చర్చలు జరిపారు. కొత్త పీసీసీ విషయంలో ఇప్పటికే తన ఆలోచనలు పంచుకున్న సీఎం.. క్యాబినెట్ విస్తరణ విషయంలో కూడా పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పీసీసీ మార్పు తర్వాతే ప్రభుత్వంలో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించినట్లు టాక్.

ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఈ నెల 27తో పీసీసీ చీఫ్‌గా ఆయన మూడేళ్ల పదవీకాలం ముగియనుంది. ఆయన టర్మ్ ముగుస్తుండటంతో.. కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై పార్టీ అధిష్టానం దృష్టిపెట్టింది. పార్టీని నడిపించే నవ నాయకుడి కోసం కసరత్తు చేస్తోంది హైకమాండ్. రెడ్డినా లేక బీసీ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలా అనేదానిపై చర్చోపచర్చలు జరుపుతోంది. తెలంగాణలో పార్టీ అధికారంలో ఉండటంతో.. పీసీసీ చీఫ్‌ రేసులో చాలామంది నేతలే ఉన్నారు. ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న నేతలు కూడా పార్టీ అధ్యక్ష పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

కర్ణాటక తరహా..
తెలంగాణలో కూడా కర్ణాటక తరహా పార్టీ పగ్గాలు అప్పగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరుతున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. పీసీసీ చీఫ్‌ కూడా కొనసాగుతున్నారు. ఇక్కడ కూడా పీసీసీ పగ్గాలు తనకు అప్పగించాలని భట్టి పట్టుబడుతున్నారు. ఇక సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని పీసీసీ చీఫ్ నియామకం ఉండే అవకాశాలు ఉండటంతో..బీసీ నేతలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు.

బీసీ సామాజికవర్గం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పీసీసీ చీఫ్‌ రేసులో ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచే జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ అంజన్ కుమార్ యాదవ్‌ పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.

పీసీసీ రేసులో తెరపైకి వస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సీతక్కలు ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నారు. వీరిలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం మంత్రి పదవి లేకపోయినా.. పీసీసీ చీఫ్ కావాలని అడుగుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మిగతా ఇద్దరు భట్టి, సీతక్క మంత్రి పదవులు వదులుకోవడానికి సిద్ధపడటం లేదని తెలుస్తోంది.

త్వరలోనే కొలిక్కి

పీసీసీ చీఫ్‌ విషయంపై త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోపే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు హస్తం పార్టీ నేతలు. పీసీసీ చీఫ్ నియామకంపై స్పష్టత వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కూడా మార్పులు, చేర్పులు చేసే చాన్సుంది. పీసీసీ చీఫ్‌తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, జాతీయ స్థాయిలో పార్టీ జనరల్ సెక్రటరీలు, ఇతర ముఖ్యపోస్టుల భర్తీని దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్ విస్తరణ ఉండనున్నట్లు చర్చ జరుగుతోంది.

క్యాబినెట్‌లో ప్రస్తుతం సీఎంతో పాటు 11 మంది మంత్రులున్నారు. ఇంకా ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. మిగతా ఆరుగురు మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా తీసుకునే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. సీఎంకు అనుకూలంగా ఉన్న నేతలతో పాటు..కొన్ని సామాజికవర్గాలకు అవకాశం కల్పించడం, ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో సీనియర్ నేతలకు అవకాశం కల్పించాలని చూస్తున్నారు.

పీసీసీ చీఫ్ నియామకం జరిగితే కానీ..క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం లేదంటున్నారు హస్తం పార్టీ లీడర్లు. పార్టీ పదవులు దక్కనివారికి క్యాబినెట్‌ బెర్తులు దక్కే చాన్స్ ఉండదంటున్నారు. ఒకవేళ పీసీసీ, ఏఐసీసీలో పదవులు దక్కితేవారికి క్యాబినెట్‌ విస్తరణలో చోటు దక్కే అవకాశం లేదని అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు.

ప్రధాని మోదీ 3.0 ఎలా ఉండబోతుంది? పూర్తి వివరాలు

ట్రెండింగ్ వార్తలు