LRS: వివిధ వర్గాల విజ్ఞప్తుల మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి పలు ప్రత్యామ్నాయాలపై స్టేట్ గవర్నమెంట్ ఆలోచనలు మొదలుపెట్టింది. త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశమున్నట్లు కనిపిస్తుంది. ఈ మేరకు ముఖ్యంగా ప్రభుత్వం రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఒకసారి కంటే ఎక్కువసార్లు రిజిస్ట్రేషన్ జరిగిన వాటిని మరలా అనుమతించాలని, ఇప్పటివరకు రిజిస్ట్రేషన్లు జరగని వాటికి మాత్రం ఎల్‌ఆర్‌ఎస్ చట్టం వర్తింపచేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు ఊరటనిచ్చేలా కొత్త పురపాలక, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అనధికార లేఅవుట్‌లలోని స్థలాలు, భవనాల్లోని ప్లాట్లు అధికారులు రిజిస్ట్రేషన్‌కు అనుమతించరు. ఎల్‌ఆర్‌ఎస్‌లేని వాటి రిజిస్ట్రేషన్లను ఆగస్టు 26వ తేదీ ముందు వరకూ అనుమతించి ఆ తర్వాత నిలిపేశారు. పంచాయతీ అనుమతి ఉందని కొనుగోలు చేసినవారు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మోసం వంటి కారణాల వల్ల కొని రిజిస్ట్రేషన్ చేసుకొన్న వారు ఇబ్బంది పడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన లేకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు జరిగాయని, కొనుక్కున్నవారి ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. బిల్డింగ్ నిర్మాణ సమయంలో ఎల్‌ఆర్‌ఎస్ మొత్తం చెల్లించేలా నిబంధన పెట్టడమా లేదా అనే అంశంపై యోచిస్తున్నట్లు సమాచారం.
కొనుగోలుదారు నుంచి ప్రత్యేక అఫిడవిట్
రిజిస్ట్రేషన్ సమయంలో కొనుగోలుదారు నుంచి ప్రత్యేకంగా అఫిడవిట్ తీసుకోనున్నట్లు తెలిసింది. అందులో రిజిస్టర్డ్ స్థలం ప్రభుత్వానికి సంబంధించినది కాదని, శిఖం స్థలం కాదని, ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదని, నాలా ఆక్రమణ లేదని ఇలా పలు అంశాలను స్పష్టం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని నిబంధనలతో ఇలాంటి ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లను అనుమతించాలనే అంశంపై కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు వచ్చినందున వీటి పరిశీలన పరిష్కారానికి సమయం తీసుకునే నేపథ్యంలో అంతవరకూ ఇబ్బందుల్లేకుండా కొంత సరళీకృతం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పురపాలకశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పంచాయతీల పరిధిలో 10లక్షల 83వేల 394 దరఖాస్తులు రాగా.. పురపాలక సంఘాల పరిధిలో 10లక్షల 60వేల 13, నగరపాలక సంస్థల పరిధిలో 4లక్షల 15వేల 155 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులు రూ.వెయ్యి చెల్లించి ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ల్యాండ్ వాల్యూ బేస్ చేసుకుని ప్లాట్ల విస్తీర్ణం మేరకు క్రమబద్ధీకరణ ఛార్జీలను ప్రభుత్వం నిర్దేశించింది.