Maganti Gopinath passed away: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీనాథ్ మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. గోపీనాథ్ మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని అన్నారు. ఆయన ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొన్నారు. సౌమ్యుడైన ప్రజానేతగా పేరు సంపాదించారని అన్నారు. మాగంటి కుటుంబం, అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి..
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మహేశ్ కుమార్ గౌడ్ సంతాపం..
సీనియర్ శాసన సభ్యులు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. గోపీనాథ్ కింది స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా, ప్రజానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబానికి తన సానుభూతి తెలిపారు.
కేటీఆర్, హరీశ్ రావు సంతాపం..
మాగంటి గోపీనాథ్ మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని అన్నారు. గోపీనాథ్ ను కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు.
కిషన్ రెడ్డి సంతాపం..
మాగంటి గోపీనాథ్ మృతిపట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం బాధాకరమని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల తలలో నాలుకగా గోపీనాథ్ ఉండేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.