Mahabubnagar Jail: ఓరి వీడి దుంపతెగ.. ప్రియురాలి కోసం ఏకంగా జైలు గోడ దూకేశాడు.. చివరికి ఎం జరిగిందో తెలుసా?
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం(Mahabubnagar Jail)లో కలకలం రేకెత్తిస్తూ జైలు నుంచి ఓ రిమాండ్ ఖైదీ చాకచక్యంగా తప్పించుకున్నాడు.
- V Santhosh Kumar
- Published on- July 6, 2026 / 02:25 PM IST
A accused in POCSO case escaped from Mahabubnagar Jail to meet his girlfriend
- ప్రియురాలి కోసం ఖైదీ పరారీ
- టవల్స్‌తో జైలు గోడ దూకాడు
- పోలీసుల ముమ్మర గాలింపు చర్యలు
Mahabubnagar Jail: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కలకలం రేకెత్తిస్తూ జైలు నుంచి ఓ రిమాండ్ ఖైదీ చాకచక్యంగా తప్పించుకున్నాడు. అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన 22 ఏళ్ల కిశోర్ కుమార్ అనే యువకుడు గత 25 రోజుల క్రితం ఒక పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా అరెస్ట్ అయ్యాడు. అప్పటినుంచి స్థానిక జిల్లా జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉంటున్న అతడు, అక్కడ జైలు క్యాంటీన్‌లో పనులకు సహాయం చేస్తూ అందరి కళ్లు గప్పేందుకు ప్రణాళిక రచించాడు.
పోలీసుల సమాచారం ప్రకారం.. కిశోర్ కుమార్ ప్రియురాలు ప్రస్తుతం వనపర్తి జిల్లాలోని ‘సఖి’ కేంద్రంలో ఆశ్రయం పొందుతోంది. ఎలాగైనా ఆమెను కలుసుకోవాలనే ఉద్దేశంతో అతడు సోమవారం ఉదయం ఒక సాహసోపేతమైన ప్లాన్ వేశాడు. బ్యారెక్‌లో ఉన్న సిబ్బందితో తాను బాత్రూమ్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చాడు. ఆ తర్వాత ముందుగానే సిద్ధం చేసుకున్న నాలుగు టవల్స్ ఒకదానికొకటి గట్టిగా ముడివేసి, జైలు (Mahabubnagar Jail)గోడ సహాయంతో పైకి పాకి, అవతలి వైపునకు దూకి క్షణాల్లో మాయమయ్యాడు.
ఈ ఖైదీ పరారీ ఉదంతం జైలు అధికారుల్లో తీవ్ర కలకలం సృష్టించింది. విషయం తెలుసుకున్న జోగులాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ వెంటనే స్పందించి, జైలు సూపరింటెండెంట్ శశికాంత్‌తో మాట్లాడి భద్రతా లోపాలపై ఆరా తీశారు. ఖైదీ తప్పించుకున్న తీరుపై పూర్తి వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఈ ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న కిశోర్ కుమార్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
