CURE Bill : హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. 70 ఏళ్ల బల్దియా చట్టానికి గుడ్‌బై.. క్యూర్ ముసాయిదా వచ్చేస్తోంది.. దీనివల్ల ఉపయోగాలేమిటంటే?
CURE Bill : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన CURE Bill 2026తో హైదరాబాద్‌లో 70 ఏళ్ల GHMC చట్టానికి గుడ్‌బై చెప్పనుంది. ఈ క్యూర్ బిల్లు ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్, హైడ్రా, అక్రమ నిర్మాణాలు, నైట్ ఎకానమీ, ఫుడ్ సేఫ్టీ, స్మార్ట్ గవర్నెన్స్ వంటి విభాగాల్లో కీలక మార్పులు తీసుకురానున్నారు.
CURE Bill 2026
CURE Bill : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మహానగర పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 70ఏళ్ల జీహెచ్ఎంసీ చట్టానికి స్వస్తి చెప్పబోతోంది. మూడు కార్పొరేషన్లు (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) కలిపి కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది. ఈ మేరకు క్యూర్ ముసాయిదా బిల్లు (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) -2026ను ఆదివారం విడుదల చేసింది. ఈ బిల్లులో 43 చాప్టర్లు, తొమ్మిది షెడ్యూళ్లు ఉన్నాయి. జూలై 24 వ తేదీ వరకు ప్రజాభిప్రాయాలు, సూచనలు స్వీకరించనున్నట్లు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి (ఎంఏయూడీ) శాఖ ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) 2026 ముసాయిదా బిల్లు అమల్లోకి వస్తే హైదరాబాద్ పరిధిలోని ఆస్తి యాజమానులపై పన్నుభారం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న వార్షిక అద్దె విలువ విధానానికి బదులుగా, ఆస్తి మూలధన విలువ ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్ ను నిర్ణయించే విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. అంతేకాక.. రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం నిర్ణయించే మార్కెట్ విలువను ఆధారంగా తీసుకొని స్థలాలు, భవనాలపై ఆస్తిపన్ను విధించనున్నారు. దీంతో ముఖ్యంగా పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనేక ఆస్తులపై పన్ను గణనీయంగా పెరిగే అవకాశాలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉన్న భవనాలకు పన్ను పెంపును దశలవారీగా అమలు చేసే అవకాశం ఉంది. కొత్తగా నిర్మించే భవనాలకు కొత్త విధానం వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం తెలుస్తోంది.
క్యూర్ ముసాయిదా బిల్లు అమల్లోకి వస్తే.. క్యూర్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడతారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా.. అందులో ఎవరైనా నివాసం ఉండే పరిస్థితి ఉన్నా.. కమిషనర్లు 24 గంటల ముందు నోటీసులు ఇచ్చి సీజ్ చేయొచ్చు. ఒకవేళ ప్రజల భద్రతకు ఇబ్బందిగా ఉంటే ఎలాంటి నోలీసులు ఇవ్వకుండానే సీజ్ చేసే అవకాశం ఉంటుంది. క్యూర్ చట్టంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చారు. ఖాళీ స్థలాల్లో చెత్త ఉంటే ప్లాట్ మూలధన విలువలో 0.25శాతం మేర జరిమానా విధిస్తారు. చెత్త తొలగించే వరకు జరిమానాల విధింపు ఉంటుంది. ఈ విధానం ద్వారా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
క్యూర్ చట్టం ముసాయిదాలో ఆహార భద్రతకు సంబంధించి కీలక ప్రతిపాదనలు ఉన్నాయి. కొత్త చట్టంలో అధ్యాయం-33లో ఆహార భద్రత, పోషకాహారం అంశాలను చేర్చారు. దీని ప్రకారం పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కన్వీనర్‌గా ‘ఆహార భద్రత, పోషకాహార కమిటీ’ ఏర్పాటు చేస్తారు. క్యూర్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల అమలును ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. పర్యావరణం పరిరక్షణకూ ఈ క్యూర్ బిల్లులో ప్రాధాన్యత ఇచ్చారు. విపత్తుల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. ఏదైనా విపత్తు తలెత్తితే ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేయడానికి క్యూర్ స్మార్ట్ గవర్నెన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. అంతేకాక హైడ్రాకు చట్టబద్ధ గుర్తింపు కల్పిస్తూ చెరువులు, కాలువలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో అప్పగించనున్నారు.
క్యూర్ బిల్లులో సెక్షన్ -168 ప్రకారం.. అనుమతిలేని ఆస్తులు, అక్రమ నిర్మాణాల క్రయ విక్రయాలు, బదిలీలు నిషేధం, అనధికార నిర్మాణాల యాజమానులకు సంబంధిత అధికారి నోటీస్ జారీ చేసి నిషేధిత జాబితాలో చేర్చుతారు. ఈ నూతన బిల్లు ద్వారా నైట్ ఎకానమీకి ప్రోత్సాహం అందించే కీలక ప్రతిపాదన చేశారు. పలు ప్రాంతాలను నైట్ ఎకానమీ జోన్లుగా ప్రకటించి రాత్రంతా వ్యాపారాలకు అనుమతి ఇవ్వనున్నారు. క్యూర్‌లోని ప్రజలకు అన్ని అత్యవసర సేవలకు ఒకే ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తెస్తారు.
క్యూర్ బిల్లును ప్రజా సంప్రదింపుల కోసం అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వం తెలిపింది. పౌరులు తమ అభిప్రాయాలు, సూచనలను ఆన్లైన్ ద్వారా (https://ghmc.gov.in/categoryWise InsertReport.aspx) సమర్పించాలని పేర్కొంది. మూడు కార్పొరేషన్ల వెబ్ సైట్లలో ముసాయిదా బిల్లును అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. రాతపూర్వకంగా కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ, సచివాలయం, హైదరాబాద్‌కు తమ సూచనలను పంపొచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే, ఈ సూచనలు, అభ్యంతరాలను కేవలం జులై 24వ తేదీ వరకు మాత్రమే స్వీకరించటం జరుగుతుందని ప్రభుత్వం ప్స్టం చేసింది.
