Telangana RTC Strike: సమ్మె విరమించకపోతే కఠిన చర్యలు.. ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యం హెచ్చరిక
సమ్మె కారణంగా ఉదయం నుంచి ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. డిపోలకే పరిమితం అయ్యాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- Naveen
- Updated on- April 22, 2026 / 05:09 PM IST
Telangana RTC Strike: సిబ్బంది వెంటనే సమ్మె విరమించాలని ఆర్టీసీ యాజమాన్యం కోరింది. సమ్మె విరమించకపోతే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించింది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఒక వివాదం పెండింగ్ లో ఉన్నప్పుడు సమ్మెకు దిగడం చట్ట విరుద్ధం అని ఆర్టీసీ యాజమాన్యం తేల్చి చెప్పింది. చట్ట విరుద్ధమైన సమ్మెలో పాల్గొనే వారిపై వేతన కోతతో పాటు కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికైనా సమ్మెను విరమించి విధుల్లో చేరాలని టీజీఎస్ ఆర్టీసీ చైర్మన్ నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ తేల్చి చెప్పింది. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సమ్మె కారణంగా ఉదయం నుంచి ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. డిపోలకే పరిమితం అయ్యాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్ స్టాప్ ల దగ్గర బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు సమ్మెను ఆసరాగా చేసుకుని ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ వాహనదారులు అందినకాడికి దోచుకుంటున్నారు. గత్యంతరం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు వాపోతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్ర చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆర్టీసీ సమ్మె వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వెంటనే సమ్మెను విరమించి చర్చలకు రావాలని ఆర్టీసీ కార్మికులకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్.
Also Read: హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావులకు భారీ ఊరట.. కమిషన్ రిపోర్టు నిలిపివేత..
