Manipulation in Telangana EAMCET Ranks : తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో మళ్లీ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈసారి కూడా ఉన్నత విద్యామండలి తీరు మార్చుకోలేదు. ఎంసెట్ ర్యాంకుల కేటాయింపుల్లో మళ్లీ అవకతవకలు జరిగాయి. ఎంసెట్‌లో కటాఫ్ మార్కులు వచ్చినా.. ఇంటర్‌లో అన్ని సబ్జెక్టుల్లో పాసైనా.. రిజల్ట్‌లో మాత్రం ఫెయిల్డ్ ఇన్ క్వాలి ఫైయింగ్ ఫలితం చూపించింది.
పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు సైతం ర్యాంకులు కేటాయించారు. కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయి ప్రమోటైన వారికి కూడా ర్యాంకులు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. ఎంసెట్ ఫలితాలను చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు షాక్ అవుతున్నారు.
ఉన్నత విద్యకు ఎంతో ముఖ్యమైన ఎంసెట్ లాంటి పరీక్షా ఫలితాల్లో ఇలాంటి గందోరగోళ పరిస్థితి నెలకొనడంపై.. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో ఉన్నత విద్యామండలి ఆటలాడుతోందని విమర్శిస్తున్నారు.
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు మొన్న విడుదల అయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంజినీరింగ్ లో 75.29 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ లో తొలి పది ర్యాంకులు అబ్బాయిలే సాధించారు. వారణాసి సాయితేజకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది. యశ్వంత్ సాయి సెకండ్ ర్యాక్, మణివెంకట కృష్ణ థర్డ్ ర్యాంకు సాధించారు.
కౌశల్ కుమార్ రెడ్డి 4వ ర్యాంకు, రాజ్ పాల్ 5వ ర్యాంకు, నితిన్ సాయి 6వ ర్యాంకు, కృష్ణ కమల్ 7వ ర్యాంకు, సాయివర్దన్ 8వ ర్యాంకు, వి.సాయి పవన్ 9వ ర్యాంకు, వారణాసి వచన్ సిద్ధార్థ్ 10వ ర్యాంకు సాధించారు. కాగా, కరోనా సోకి ఎంసెట్ పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు అక్టోబర్ 8న పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.