Massive theft in Chaderghat
Hyderabad: హైదరాబాద్‌లోని ఛాదర్‌ఘాట్ పీఎస్ పరిధిలో భారీ చోరీ జరిగింది. వ్యాపారి ఫహిముద్దీన్ ఇంట్లోకి దొంగలు ప్రవేశించి 75 తులాల బంగారు నగలు, రూ.2.50లక్షల నగదు చోరీ చేశారు.
భార్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో ఫహిముద్దీన్ శుక్రవారం రాత్రి ఇట్లో తల్లిదండ్రులను ఉంచి ఆస్పత్రికి వెళ్లాడు. ఇంటి వెనుక నుంచి లోనికి ప్రవేశించిన దొంగలు.. ఫహిముద్దీన్ తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదికి బయట నుంచి గొళ్లెం పెట్టారు. దర్జాగా ఇంట్లోకి ప్రవేశించి రాత్రి చాలాసేపు ఇంట్లోనే ఉన్నారు. ఫ్రిడ్జ్‌లో పండ్లు తిని బీరువాలో బంగారం, నగదు, ఇతర వస్తువులు దోచుకెళ్లారు.
తెల్లవారు జామున ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన ఫహిముద్దీన్ దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. ఇంట్లో బీరువాలోని నగదు, నగలు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చాదర్‌ఘాట్ పోలీసులు, సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, క్లూస్ టీమ్ ఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.