Telangana Rains : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ..
Telangana Rains : వాతావరణ శాఖ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇవాళ, రేపు (గురువారం), రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
- Harish Thanniru
- Published on- September 16, 2026 / 10:24 AM IST
Telangana Weather
Telangana Rains : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తాజాగా.. వర్షాలపై వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధానంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.
కర్ణాటక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఏర్పడిన ద్రోణి మంగళవారం తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, 19, 20, 21 తేదీల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వాతావరణ శాఖ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇవాళ, రేపు (గురువారం), రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 19వ తేదీన ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న వాతావరణ శాఖ.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 20, 21 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
భారీ వర్షాలకుతోడు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
ఇదిలాఉంటే.. గడచిన 24గంటల్లో హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 9.2 సెంటీమీటర్లు, జనగాం జిల్లా నర్మెట్టలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా.. ఈనెల 1 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 61 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని, ఈ పదిహేను రోజుల్లో సాధారణ సగటు వర్షపాతం 86 మిల్లీమీటర్లు కాగా.. ఈ నెలలో ఇప్పటికే 28శాతం లోటు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది.
గతేడాది సెప్టెంబర్ నెలలో మొదటి పదిహేను రోజుల్లో ఏకంగా 117 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటి వరకు సగటు సాధారణ వర్షపాతం 659 మిల్లీమీటర్లకుగాను 535 మిల్లీమీటర్లే కురిసింది. ఈ సీజన్లో 19శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
