తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడ్రోజులు ఆ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు..

తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా.. కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటరల్ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

 

మరోవైపు.. అదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఆ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుకు చెందిన 12 గేట్లను అధికారులు ఓపెన్ చేశారు.

జూరాల ప్రాజెక్టు..
ఇన్ ఫ్లో : 1,05,000 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 1,03,908 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 318.516 మీటర్లు
ప్రస్తుత నీటి సామర్థ్యం: 317.380మీటర్లు