Weather Updates : బాబోయ్‌ ఎండలు.. ఈ జిల్లాల్లో రేపటి నుంచి మంటలే..! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు.. ఇక హైదరాబాద్‌లో..

Weather Updates : తెలంగాణలో భయంకరమైన ఎండలు ఉంటాయి. ఆకాశంలో పలుచని మేఘాలు ఉన్నా.. వాటివల్ల ఎలాంటి చల్లదనమూ ఉండదు. ఉదయం నుంచే భగ్గుమనే వేడి ఉంటుంది.

Weather Updates

  • తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత
  • రేపటి నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
  • వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఏప్రిల్ నెల ప్రారంభంలోనే భానుడు సుర్రుమనిపిస్తున్నాడు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి పొయ్యిమీద కాలుతున్న పెనంలాగా మారింది. ఒకపక్క అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ.. భానుడు ప్రతాపం ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపటి నుంచి ఎండ తీవ్రత మరింత తీవ్రంగా ఉంటుందని, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Also Read : TG TET 2026 Exam : టెట్ రాసేందుకు సిద్ధమవుతున్నవారికి గుడ్‌న్యూస్.. నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

జూమ్ ఎర్త్ లైవ్ శాటిలైట్ డేటా ప్రకారం.. ఆదివారం నుంచి తెలంగాణలో భయంకరమైన ఎండలు ఉంటాయి. ఆకాశంలో పలుచని మేఘాలు ఉన్నా.. వాటివల్ల ఎలాంటి చల్లదనమూ ఉండదు. ఉదయం నుంచే భగ్గుమనే వేడి ఉంటుంది. ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటాయి. ఉక్కపోత ఉండకపోయినా భరించలేని వేడి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

దీంతో ప్రజలు మధ్యాహ్నం వేళల్లో ఇళ్లలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని.. తప్పనిసరిగా బయటకు రావాల్సి వస్తే వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 40డిగ్రీలకు పైగా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 12 నుంచి ఎండ తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల వరకు పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఏప్రిల్ 22వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

గత వారం రోజులుగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం నల్గొండ జిల్లా ఘనపూర్‌లో అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా 27 జిల్లాల్లో 40డిగ్రీలకుపైగా గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.