Telangana Rains: తెలంగాణలో రానున్న రెండు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక
తెలంగాణ(Telangana Rains)లో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- V Santhosh Kumar
- Published on- September 25, 2026 / 10:42 PM IST
Meteorological Department indicates possibility of rain in Telangana for next two days.
Telangana Rains: తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Telangana Rains)పడే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సహాయక చర్యలకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని అధికారులు తెలిపారు.
యెల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు – వర్ష తీవ్రత ఎక్కడ?
రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం పరిధిలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రత్యేకంగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. ఈ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్ వాతావరణం – మబ్బులు, జల్లులు:
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రానున్న రెండు రోజుల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఒక మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు జాగ్రత్తలు వహించాలని సూచించారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముంది.
