Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాల అలర్ట్.. హైదరాబాద్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక!
అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు(Rain Alert) కురిసే అవకాశముందని వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది.
- V Santhosh Kumar
- Published on- September 6, 2026 / 07:42 PM IST
Meteorological Department issued warning heavy rains in tg and AP for next two days.
- రెండు రోజులు భారీ వర్షాలు
- 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- బలమైన ఈదురుగాలుల హెచ్చరిక
Rain Alert: అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణలో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. హైదరాబాద్‌లో మోస్తరు వానలు:
తెలంగాణ వ్యాప్తంగా రాబోయే 48 గంటల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు(Rain Alert) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం పడే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ ఈదురుగాలుల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు.
కోస్తాంధ్ర, రాయలసీమలోనూ వర్ష ప్రభావం.. తేమతో కూడిన వాతావరణం:
ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఆదివారం నుంచి మంగళవారం వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 50 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే వీలుంది. వానలు పడే సమయం మినహా మిగిలిన వేళల్లో వేడి, అధిక తేమతో అసౌకర్యమైన వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తీరప్రాంత ప్రజలు, రైతులు వాతావరణ హెచ్చరికలను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
