Weather Update: ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు..? వాతావరణ శాఖ ఏం చెబుతోంది?

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. వారం రోజుల నుంచి పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు పడగా.. గత మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది.

Rain

Telangana Rain: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. వారం రోజుల నుంచి పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు పడగా.. గత మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. వర్షం కారణంగా రోడ్లపైకి వర్షపు నీరు వస్తుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో వాహనదారులు, నగర వాసులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ వర్షాల ప్రభావం ఈనెల 26వ తేదీ వరకు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడ్రోజుల్లో తెలంగాణలోని హైదరాబాద్ సహా పలుజిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో ఇవాళ (బుధవారం) భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 14 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.


భారీ వర్షాలతోపాటు పలు ప్రాంతాల్లో 30 నుంచి 40కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ములుగు, హన్మకొండ, భద్రాద్రి, సూర్యాపేట జిల్లాలో భారీగా వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లలో గడిచిన 24గంటల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని షేక్ పేటలో 86.5 మి.మీ వర్షపాతం నమోదైంది. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో సుమారుగా 25 నుంచి 30 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ రోజంతా నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశాల ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడ్రోజులు నగరంలో వర్ష ప్రభావం ఉంటుందని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగపేట మమండలం మల్లూరు గ్రామం నీట మునిగింది. గ్రామ శివారులోని చెరువు లీకేజీకావడంతో వర్షంపు నీరు గ్రామంలోకి వచ్చింది. మోకాళ్లలోతు నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలతో జిల్లా అధికారులు అలర్ట్ గా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సిరిసిల్ల రూట్ లోని రాంనగర్ నీటితో నిండిపోయింది.