Rain Alert: ఏపీ, తెలంగాణలో తీవ్ర వాతావరణ మార్పులు.. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ సూచనలు
బంగాళాఖాతం ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణంలో (Rain Alert)మార్పులు చోటుచేసుకోనున్నాయి.
- V Santhosh Kumar
- Published on- August 11, 2026 / 06:32 AM IST
Meteorological Department warned heavy rains in Andhra Pradesh and Telangana next 48 hours
- రెండు రోజులు భారీ వర్షాలు
- తీరప్రాంతాల్లో బలమైన గాలులు
- అనేక జిల్లాలకు హెచ్చరికలు జారీ
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రానున్న రెండు రోజులు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో పాటు ఈశాన్య, ఈశాన్య-మధ్యప్రదేశ్ ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో గాలి ఒత్తిడి ఏర్పడింది. దీని కారణంగా రాబోయే 48 గంటల్లో ఉపరితల ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన చినుకులు పడే సంకేతాలు ఉన్నాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు సంయుక్తంగా వెల్లడించాయి.
Balineni-Damacharla: ఒంగోలులో వేడెక్కిన రాజకీయం.. జైల్లో వేసేంత మగాడివా? దామచర్లకు బాలినేని సవాల్
ఆంధ్రప్రదేశ్ వాతావరణం, జిల్లాల హెచ్చరికలు:
ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాలతో పాటు రాయలసీమ వ్యాప్తంగా రాగల రెండు రోజులలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు (Rain Alert)పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షపాతం నమోదుకావచ్చు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని సూచించారు. రాయలసీమ పరిధిలోని వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ పసుపు రంగు (యెల్లో) హెచ్చరికలను జారీ చేసింది.
తెలంగాణ వాతావరణ సూచన, వాతావరణ శాఖ జాగ్రత్తలు:
తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా రాబోయే రెండు రోజులు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెదపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే వీలుండటంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. వర్షం కురిసే సమయంలో గంటకు 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ఐఎమ్‌డీ సూచించింది. ఉరుములు, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల సమీపంలో గానీ నిలబడవద్దని అధికారులు సూచనలు జారీ చేశారు.
