Jupally Krishna Rao : రాష్ట్ర అప్పులపై నా లెక్కలు తప్పని కేసీఆర్‌తో మాట్లాడించగలరా? తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తా.. మంత్రి జూపల్లి
Minister Jupally Krishna Rao : బీఆర్ఎస్ నాయకులు వాస్తవాలను పక్కనబెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.
- Harish Thanniru
- Updated on- July 3, 2026 / 05:48 PM IST
Minister Jupally Krishna Rao
- అప్పులపై చర్చకు రమ్మని లేఖరాశా..
- బీఆర్ఎస్ నేతలు ఎందుకు రాలేదు?
- అప్పుల విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలి
- బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి స్ట్రాంగ్ వార్నింగ్
Jupally Krishna Rao : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అప్పులపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం, సవాళ్ల పర్వం కొనసాగుతోంది. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఆర్థిక అక్రమాలు, అప్పులపై తాము చూపిస్తున్న లెక్కలు తప్పని కేసీఆర్ తో చెప్పిందే ధైర్యం ఉందా అని నిలదీశారు. ఈ వివాదాస్పద అంశాలపై శుక్రవారం సాయంత్రం 5గంటలకు ప్రెస్‌క్లబ్‌లో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి ప్రకటించారు. సవాల్ ఛేసినట్లుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్న మంత్రి జూపల్లి.. అక్కడే మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Also Read : Telangana Rains : తెలంగాణకు మూడ్రోజులు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భీకరగాలులతో దంచికొట్టనున్న వానలు
బీఆర్ఎస్ నాయకులు వాస్తవాలను పక్కనబెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. తాను అడిగిన ప్రశ్నలకు మాజీ మంత్రి హరీష్‌రావు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని ఆరోపించారు. పారిపోవడం మా ఇంట వంట లేదు. నేను అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పకుండా హరీష్‌రావు సోల్లు పురాణం చెబుతున్నారు. నేను అడిగింది ఏమిటి? ఆయన చెప్పింది ఏమిటి?” అని మంత్రి ప్రశ్నించారు.
ఈ అంశంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు కోసం మూడు కుర్చీలు వేసి చర్చకు సిద్ధమని, ముగ్గురికీ నాలుగు పేజీల లేఖ రాసి తన వాట్సాప్ నుంచి పంపినట్లు తెలిపారు. అయితే హరీష్‌రావు పంపిన సమాధాన లేఖలో తన ప్రశ్నలకు సంబంధించిన ఒక్క అంశం కూడా లేదని విమర్శించారు. తాము ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాట్లాడాలని ఎక్కడా చెప్పలేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించే ప్రశ్నించానని జూపల్లి స్పష్టం చేశారు. కేటీఆర్, హరీష్‌రావు చెబుతున్న వివరాలు వాస్తవాలకు విరుద్ధమని తాను నిరూపించానన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేసిందని, ఏ పద్దు కింద ఎంత అప్పు తీసుకున్నారో కూడా పూర్తి వివరాలతో వెల్లడించానని మంత్రి తెలిపారు. అయినప్పటికీ తాను లేవనెత్తిన అంశాలపై బీఆర్ఎస్ నాయకులు ఎక్కడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. నా లెక్కలు తప్పని కేసీఆర్‌తో మాట్లాడించగలరా? నేను చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
