Former OSD Sumanth : మంత్రి కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌పై హత్యాయత్నం కేసు!
Former OSD Sumanth : మాజీ ఓఎస్డీ సుమంత్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి హరికృష్ణపై ఇనుప రాడ్లతో దాడి చేశారనే ఆరోపణలతో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- Sreehari A
- Updated on- August 20, 2026 / 08:12 PM IST
Former OSD Sumanth
- సుమంత్‌పై 109 సెక్షన్ కింద కేసు నమోదు
- రాడ్లతో దాడి చేసినట్టు గొంగడి హరికృష్ణ ఫిర్యాదు
- జీరో FIR నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు
Former OSD Sumanth : తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై హైదరాబాద్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మేడిపల్లి పోలీసులు సుమంత్ సహా మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 109 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
హరికృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. సుమంత్ గతంలో తనను కలవాలని ఫోన్ చేశాడు. అప్పుడు తాను (Former OSD Sumanth) అందుబాటులో లేకపోవడంతో తర్వాత కలుస్తానని హరికృష్ణ చెప్పానన్నారు. అనంతరం తన స్నేహితుడు రాము ఆఫీసుకు వెళ్లిన సమయంలో సుమంత్ అక్కడే ఉన్నాడని పేర్కొన్నారు.
Read Also : Konda Surekha : సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం.. నాకేం సంబంధం? కొండా సురేఖ వివరణ
అయితే, అక్కడ తన పేరు అడ్డుపెట్టుకుని బయట డబ్బులు వసూలు చేస్తున్నావంటూ సుమంత్ ప్రశ్నించినట్లు హరికృష్ణ ఆరోపించారు. తాను ఎలాంటి వసూళ్లకు పాల్పడలేదని చెప్పినా వినలేదని, పైగా దుర్భాషలాడుతూ ఇనుప రాడ్డుతో కాళ్లు, చేతులపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. అలాగే సుమంత్‌తో ఉన్న మరో ఐదుగురు కూడా తనపై దాడికి పాల్పడ్డారని హరికృష్ణ ఆరోపించారు.
తనపై దాడి చేసిన విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా బెదిరించినట్లు హరికృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును తీసుకున్న మేడిపల్లి పోలీసులు ముందుగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత తదుపరి దర్యాప్తు కోసం కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
అయితే, ఈ ఆరోపణలపై సుమంత్ ఇప్పటివరకూ స్పందించలేదు. ఘటనకు సంబంధించిన అసలు కారణాలేంటి? దాడిలో ఎవరి పాత్ర ఎంత ఉందనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
