Ponnam Prabhakar: బీసీ మహిళలకు సర్కార్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ.. పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
సచివాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ప్రారంభించారు.
- V Santhosh Kumar
- Published on- August 13, 2026 / 04:14 PM IST
Minister Ponnam Prabhakar key announcement on free sewing machines to BC women
- బీసీ మహిళలకు బంపర్ ఆఫర్
- ఉచితంగా ఆటోమేటిక్ కుట్టుమిషన్ల పంపిణీ
- ఆగస్టు నుండి దరఖాస్తులు ప్రారంభం
Ponnam Prabhakar: తెలంగాణలో బీసీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధిని ప్రోత్సహించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్న ప్రజాపాలనలో బీసీ మహిళలను కేవలం పథకాల లబ్ధిదారులుగా పరిమితం చేయకుండా, వారిని స్వశక్తితో ఎదిగే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే సచివాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
119 నియోజకవర్గాల్లో 1,19,000 కుట్టుమిషన్లు:
ఈ పథకం కింద రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రతీ నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టుమిషన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)ప్రకటించారు. ఒక్కో కుట్టుమిషన్ విలువ దాదాపు రూ.12,000 ఉండగా, లబ్ధిదారులపై పైసా భారం పడకుండా ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో వీటిని పూర్తి ఉచితంగా అందిస్తోంది. ఆధునిక ఆటోమేటిక్ మిషన్లు ఇవ్వడం వల్ల మహిళలు తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
దరఖాస్తు గడువు, అర్హతల వివరాలు ఇవే:
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన బీసీ మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఈ ఉచిత కుట్టుమిషన్ల కోసం ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అర్హులైన బీసీ మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకోవాలని కోరారు. దరఖాస్తు ప్రక్రియ, అవసరమైన పత్రాల వివరాలను త్వరలోనే సంబంధిత అధికారులు జిల్లాల వారీగా వెల్లడించనున్నారు.
