Ponnam Prabhakar – Pawan Kalyan: సభ పెట్టావో సంగతి చూస్తాం..!- పవన్ కల్యాణ్ కు మంత్రి పొన్నం వార్నింగ్..
డిప్యూటీ సీఎంగా ఏమైనా చేయగలిగితే ఏపీలో చేసుకోండి. తెలంగాణను బీజేపీకి తాకట్టు పెట్టడమే మీరు చెప్పే నవ నిర్మాణమా?
- Naveen
- Published on- June 1, 2026 / 05:54 PM IST
Ponnam Prabhakar – Pawan Kalyan: తెలంగాణ నవ నిర్మాణ సభ పేరుతో హైదరాబాద్ లో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన సభ రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణతో మీకేం పని? అంటూ ఎదురుదాడికి దిగారు. మీ రాజకీయాలు ఆంధ్రాలోనే చేసుకోండి అని సీరియస్ అవుతున్నారు. తెలంగాణలో చిచ్చు పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ లు ఇస్తున్నారు. టీఆర్ఎస్ చీఫ్ కవిత, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. అటు మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పవన్ టార్గెట్ గా చెలరేగిపోయారు.
బీజేపీ రెమ్యునరేషన్ తో పని చేస్తున్నారు..
పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో తెలంగాణ నవ నిర్మాణ సభ పెడతానడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆక్షేపించారు. బీజేపీతో ఒప్పందం మేరకే పవన్ నటన ప్రారంభించారని మండిపడ్డారు. తెలంగాణను బీజేపీకి తాకట్టు పెట్టడమే ఆయన చెప్పే నవ నిర్మాణమా అని ప్రశ్నించారు పొన్నం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 11 రోజులు అన్నం మానేశానని గతంలో పవన్ చెప్పారని మంత్రి పొన్నం గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని పవన్ అన్నారని చెప్పారు. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలకు పవన్ క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. ఆ తర్వాతే తెలంగాణలో సభ పెట్టకోవాలన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసేందుకే పవన్ బీజేపీ జెండా మోస్తున్నారని, బీజేపీ రెమ్యునరేషన్ తో పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని ధ్వజమెత్తారు మంత్రి పొన్నం.
డిప్యూటీ సీఎంగా ఏమైనా చేయగలిగితే ఏపీలో చేసుకో. తెలంగాణకు వచ్చి నవ నిర్మాణ సభ అంటే ఇక్కడ సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. తెలంగాణ పట్ల మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోము. వాస్తవంగా పవన్ కల్యాణ్ ఒక నటుడు. విలన్, గుండా, హీరో, ప్రేమికుడు.. సినీ జీవితంలో, నిజ జీవితంలో ఏం చేసినా అది మీ వ్యక్తిగతం. కానీ, తెలంగాణ జోలికి వస్తే ఊరుకునేది లేదు. రెచ్చగొట్టేలా విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా తెలంగాణ వాతావారణాన్ని కలుషితం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోము.
బీజేపీతో రేటు ఫిక్స్ చేసుకుని తెలంగాణలో నటన స్టార్ట్ చేశారు పవన్ కల్యాణ్. మీ కన్న తల్లి అయిన తెలంగాణను అవమానపరిచారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు అని అన్నారు. తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని అన్నారు. అటువంటి వ్యక్తిని ఇక్కడ మనం ఎంటర్ టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. పవన్ కల్యాణ్ ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. బీజేపీ రెమ్యునరేషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ యాక్ట్ చేయడానికి రాలేదని దేవుడి మీద ప్రమాణం చేసి పవన్ చెప్పాలి” అని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
Also Read: తెలంగాణతో మీకేం పని? క్షమాపణ చెప్పాకే సభ పెట్టాలి- పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్
