Greater Hyderabad Double Bedroom : తెలంగాణలో డబుల్ బెడ్ రూంల రగడ కొనసాగుతోంది. లక్ష ఇళ్లు కట్టలేదని, నిరూపించాలని డిమాండ్ చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గట్టి షాక్ ఇచ్చారు. చూపిస్తా రండి..అంటూ భట్టికి ఇంటికి నేరుగా తలసాని వెళ్లడం ప్రతిపక్ష కాంగ్రెస్ కు దిమ్మ తిరిగిపోయింది.
2020, సెప్టెంబర్ 17వ తేదీ గురువారం జియాగూడలోని డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలనకు తీసుకెళ్లిన తలసాని.. గోడేకీ ఖబర్, కట్టెలమండి, ఇందిరానగర్, అంబేద్కర్‌నగర్, సనత్‌నగర్ పరిధిలోని జీవీఆర్ కాంపౌండ్, పొట్టి శ్రీరాములునగర్, సీసీనగర్, బండమైసమ్మనగర్, మారేడ్‌పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను చూపించారు. చూస్తున్న ఇళ్ల సంఖ్యను భట్టి..ఓ పేపర్ లో రాసుకున్నారు.
ఇక సెప్టెంబర్ 18వ తేదీ శుక్రవారం కూడా భట్టి ఇంటికి మంత్రి తలసాని వెళ్లారు. గ్రేటర్ పరిధిలోని కొల్లూరు, కుత్బుల్లాపూర్, మేడ్చల్ జవహర్‌నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో నిర్మాణమౌతున్న డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి తలసాని చూపించనున్నారు. వీరితో పాటు..ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలున్నారు.
కొంచెం ఆలస్యమైనా పేదలకు రూ.కోటి విలువ ఇండ్లు అందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారని, లక్ష ఇండ్లతో ఆపబోమని, డిమాండ్‌కు తగ్గట్టు భవిష్యత్తులోనూ ఇండ్ల నిర్మాణం చేపడతామని తేల్చిచెప్పారు. ఇకనైనా ప్రతిపక్షాలు మారాలని సూచించారాయన.
ప్రభుత్వం లక్ష ఇండ్లు అంటున్నదని, వాటిని పరిశీలించనున్నట్టు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం కొన్ని ప్రాంతాల్లో తిరిగి 3,428 ఇండ్లను పరిశీలించామని చెప్పారు. శుక్రవారం కూడా ఇండ్లను పరిశీలించాలనుకుంటున్నట్టు వెల్లడించారు.