Uttam Kumar Reddy On BRS
బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నాలుగున్న లక్షల కోట్ల అప్పులు తెచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నల్గొండ ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. అనంతరం సోనియాగాంధీ, రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు ఉత్తమ్ దంపతులు.
ఎంపీగా తాను పార్లమెంటులో లేవనెత్తిన అంశాలను మీడియాకు వివరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొదటిసారి ఎంపీ కావడం వల్ల చాలా అంశాల్లో కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయాను అన్నారాయన. తన వల్ల తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల శాతం పెరిగిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పై ఒత్తిడితో తెలంగాణ లో గిరిజన విశ్వవిద్యాలయం సాధించామన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ గురించి అనేకసార్లు పార్లమెంట్ లో ప్రశ్నలు వేశానని గుర్తు చేశారాయన. త్వరగా బీబీ నగర్ ఎయిమ్స్ ను కేంద్రం పూర్తి చేస్తుందని భావిస్తున్నా అన్నారు. సింగరేణి కోల్ మైన్ ప్రైవేట్ పరం చేయడం, వేలం గురించి పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్ళాను అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Also Read : గిరిజనుల భూములు కబ్జా చేశారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
హైదరాబాద్ విజయవాడ మధ్య బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయాలని పార్లమెంటులో కేంద్రాన్ని కోరాను అని చెప్పారాయన. బియ్యం రీసైక్లింగ్ గురించి పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాను అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తాను అని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాతపూర్వకంగా తెలంగాణ అప్పుల వివరాలను పార్లమెంట్ ద్వారా బయటపెట్టాను అని చెప్పారు. నాలుగున్నర లక్షల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయం లో అప్పులు తెచ్చారని వెల్లడించారు.
Also Read : పార్లమెంట్లో భద్రతా వైఫల్యం.. అసలేం జరిగింది? ఆగంతకులు ఏమని నినదించారు?
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను పార్లమెంట్ వేదికగా లేవనెత్తాను అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి ఇచ్చిన హామీలను కేంద్రం అమలుపరచలేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. జాతీయ భద్రత అంశాలు, భారత్-చైనా వివాదం సహా అనేక కీలక అంశాలపై పార్లమెంటులో నా వాణి వినిపించాను అని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.