Maa Indiramma Intlo Dewali: ఈసారి ‘ఇందిరమ్మ ఇళ్లలో’ దీపావళి వేడుకలు.. నిరుపేదల ముంగిట్లో పండుగ వెలుగులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి(Maa Indiramma Intlo Dewali)’ పేరిట వేడుకలు నిర్వహించాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
- V Santhosh Kumar
- Updated on- November 4, 2026 / 08:11 PM IST
Ministers ponguleti and sridhar babu release maa indiramma intlo diwali poster
Maa Indiramma Intlo Dewali: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాల్లో ఈ దీపావళి పండుగను ఎంతో ప్రత్యేకంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే గృహప్రవేశాలు పూర్తి చేసుకున్న కుటుంబాల ఇళ్లలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి(Maa Indiramma Intlo Dewali)’ పేరిట వేడుకలు చేపట్టాలని సూచించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కేంద్రంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులిద్దరూ ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Nithin Narne: ఎన్టీఆర్ బావమరిది నటుడు నితిన్ నార్నేకి షూటింగ్ లో ప్రమాదం.. భుజానికి తీవ్ర గాయం
తొలి విడత ఇళ్ల పురోగతి.. ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లోకే నిధులు:
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉందని పొంగులేటి తెలిపారు. తొలి విడతలో మంజూరు చేసిన 4.50 లక్షల ఇళ్లలో ఇప్పటివరకు 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తయ్యాయని, మరో 1.90 లక్షల ఇళ్లు విభిన్న నిర్మాణ దశల్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.40 వేల కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పథకానికి సంబంధించి ప్రతి సోమవారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా పారదర్శకంగా నిధులు జమ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
నగరాల్లో జీ+5 ఇందిరమ్మ టవర్లు.. రాబోయే బోనాలకు కొత్త ఇళ్లలోనే సంబరాలు:
హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ కార్పొరేషన్లలో జీ+5 (G+5) విధానంలో ఇందిరమ్మ టవర్లను నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ నిర్మాణాలకు దీపావళి నాటికి నోటిఫికేషన్ జారీ చేస్తామని, హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్ల లబ్ధిదారులు వచ్చే ఏడాది బోనాల వేడుకలను తమ సొంతిళ్లలోనే జరుపుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి పండుగ సంతోషంలో భాగస్వాములు కావాలని కోరారు.
