కాకతీయ కాలువలో పడి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బావ సత్యనారాయణ రెడ్డి కుటుంబం జలసమాధి అయిన కేసును పోలీసులు చేధించారు. బావతో పాటు సోదరి రాధ, మేన కోడలు వినయశ్రీ సహా అల్గునూర్ శివారులో మృతి చెందారు. వీరిది ఆత్మహత్య అని కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి సోమవారం ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
సత్యనారాయణరెడ్డి సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్‌లో పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది. సూసైడ్ నోట్ పరిశీలన అనంతరం స్వయంగా సత్యనారాయణరెడ్డి రాసిందేనని నిర్ధారణ అయింది. 4 నెలల తర్వాత కేసు మిస్టరీ తేలింది. జనవరి 27న కరీంనగర్‌లోని బ్యాంక్ కాలనీలోని ఇంటి నుంచి సత్యనారాయణరెడ్డి తన భార్య రాధ, కుమార్తె వినయశ్రీలతో కలిసి కారులో బయలుదేరారు.
అదే రోజు వారి కారు అల్గునూరు వద్ద కాకతీయ కాలువలో పడిపోయింది. అప్పటి నుంచి వీరి ఆచూకీ కనిపించకుండా పోయింది. ఈ ఘటన జరిగిన ఇరవై రోజుల తర్వాత కరీంనగర్ నుంచి గన్నేరువరం బయలుదేరిన ఓ బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ నీటిలో కొట్టుకుపోవడంతో.. ఆమె గాలింపు కోసం కాలువలోకి విడుదలను నిలిపివేశారు.
ఈ క్రమంలోనే కాలువలో నీటి ప్రవాహం తగ్గడంతో సత్యనారాయణరెడ్డి కారు జాడ తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఘటనపై మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఆత్యహత్య చేసుకునేంత ఇబ్బందులు కూడా లేవని వెల్లడించారు.