చిన్న కులాలపై ఎమ్మెల్యే కామెంట్లు.. చివరకు క్షమాపణలు!

dharma reddy:అయోధ్య రామ మందిరంపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వరంగల్‌లో దుమారం రేపుతుండగా.. ఆదివారం జరిగిన మరో కార్యక్రమంలో చాలా సున్నితమైన అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. వివాదం తీవ్రం కావడంతో క్షమాపణలు చెప్పుకొచ్చారు. హన్మకొండలో జరిగిన ఓసీల రాష్ట్ర మహా గర్జన సభలో చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. 99 శాతం మార్కులు వచ్చిన అగ్రకులాల వారికి ప్రభుత్వంలో ఉద్యోగాలు రావట్లేదని, చదువు సరిగ్గారాని తక్కువ కులంవారు ఉద్యోగాలు పొందుతున్నట్లు చెప్పుకొచ్చారు.

‘‘ఓ రోజు మా నియోజకవర్గంలో అందరు ఏఈలు కలిసి నా దగ్గరకు వచ్చారు. ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి.. ‘సార్‍ మా దగ్గర మంచి ఆఫీసర్ ఉన్నాడు. మీ దగ్గర పెట్టుకొండని కోరితే పెట్టుకున్నా.. తర్వాత అతనిని పిలిచి మాట్లాడితే, అక్షరం ముక్క రాదు. ఇదే విషయాన్ని ఆయనను పెట్టించిన వాళ్లను అడిగా.. అడిగితే.. ‘ఏంలేదు సార్‍.. మీరు ఫైల్‍ తీసుకెళ్లి ఎక్కడ సంతకం పెట్టుమంటే అక్కడ పెడతాడు. ఎక్కువ తెలివి ఉంటే అడ్డం తిరుగుతరు సార్. ఈయన మంచోడు. అవేం అడగడని నాతో అన్నారు. ఆ ఆఫీసర్‌ను ఏం అడిగినా.. నాకు తెలియదని అంటాడు. అలాంటి వ్యక్తి ఉన్నతాధికారి అయ్యాడు.’ అని ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఓ సంధర్భాన్ని ఊటంకిస్తూ మాట్లాడారు. చిన్నకులాల ఉద్యోగులకు అక్షరం ముక్క రాదు.. రాష్ట్రం మొత్తం నాశనమయ్యేందుకు అటువంటి ఆఫీసర్లే కారణం అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా.. చివరకు ఆయన క్షమాపణలు కోరారు.

అంతేకాదు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఆఫీస్‌కు పోయినా ఉన్నతాధికారులు ఇలాంటి వారే ఉన్నారని, పని రాదు.. చివరికి జిల్లా అధికారులు కూడా వాళ్లే ఉన్నారు. రాష్ట్రం మొత్తం నాశనం అవడానికి ఇలాంటి ఉన్నతాధికారులే కారణం” అని ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్ల వాళ్లు రిజర్వేషన్లు పొందుతున్నారు. ఇలా రిజర్వేషన్లు పొందుతూ నేను తప్ప ఇంకొకరు బాగుపడొద్దు అనే ధోరణిలో వాళ్లు ఉన్నారు. ఒకరికి రిజర్వేషన్‌ వల్ల మంచి స్థితి వస్తే ఇక ఆ కుటుంబానికి రిజర్వేషన్ అవసరం లేదని నేను వాదిస్తా. ఎప్పుడో వచ్చిన ఈ రిజర్వేషన్లను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరుతున్నా.” అని చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. దీనిని కాంటవర్సీ చేయొద్దని, ఇదంతా అగ్రకులాల ఆవేదన అంటూ చెప్పుకొచ్చారు.

ఓసీ మహాగర్జన సభలో మాట్లాడిన తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. తనపై బురదజల్లేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తన వ్యాఖ్యలు తప్పైతే ఆ వ్యాఖ్యలను విరమించుకుంటున్నానని ప్రకటించారు. నా వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై వివరించే క్రమంలో అలా మాట్లాడానని ధర్మారెడ్డి చెప్పారు.