MLA Rekha Nayak, Neelam Madhu Mudiraj
BRS – Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఇవాళ విడుదల చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో తమ పేరు లేకపోవడంతో పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డ తమకు తగిన బుద్ధి చెప్పారని వాపోతున్నారు.
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరులో కార్యకర్తలు నిరసనలకు దిగారు. టికెట్ ఆశించిన నీలం మధు ముదిరాజ్ (Neelam Madhu Mudiraj) తీవ్ర నిరాశ చెందారు. బీసీలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముదిరాజ్ లకు ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బీసీల కోసం మరో ఉద్యమం చేస్తామని చెప్పారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో అనుచరులతో ఎమ్మెల్యే రేఖానాయక్ సమావేశం నిర్వహించారు. ఖానాపూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ కు టికెట్ దక్కలేదన్న విషయం తెలిసిందే. ఆ స్థానం నుంచి భూక్యా జాన్సన్ రాథోడ్ కు కేసీఆర్ ఛాన్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా రేఖా నాయక్ మాట్లాడుతూ… మరో 50 రోజులు తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పారు.
చివరి నిమిషం వరకు గ్రామాల్లో తిరుగుతానని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. 50 రోజుల తర్వాత ప్రజల అభీష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందని చెప్పారు. పార్టీ మారాలని ఇప్పటివరకైతే అనుకోలేదని అన్నారు. తన జీవితం ఖానాపూర్ ప్రజలకు అంకితమని చెప్పారు. చిట్టచివరి వరకు ఖానాపూర్ లోనే ఉంటానని స్పష్టం చేశారు.
పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి నల్ల మనోహర్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన మంత్రి కేటీఆర్ కు తొమ్మిదేళ్లుగా ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గానైనా బరిలో ఉంటానని నల్ల మనోహర్ రెడ్డి తెలిపారు.
Telangana Cabinet: తెలంగాణ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు సర్వం సిద్ధం.. మాజీ మంత్రికి ఛాన్స్