Jagtial Twins Adoption : తల్లి చనిపోయింది.. తండ్రి నిస్సహాయతే ఆసరా.. కవల శిశువుల దత్తత కలకలం

Jagtial Twins Adoption : తల్లి చనిపోతూ ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆ పిల్లల పోషణ భారం మోయలేని తండ్రి అమ్మకానికి పెట్టిన ఘటనం జగిత్యాలలో స్థానికంగా కలకలం రేపింది.

Jagtial Twins Adoption

Jagtial Twins Adoption : కన్న తల్లి చనిపోయింది.. పుట్టిన కవల శిశువులను పోషించే శక్తి తండ్రికి లేదు.. దీన్నే ఆసరాగా చేసుకుని శిశువుల విక్రయానికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో చోటుచేసుకుంది.

జిల్లాల్లో కవల శిశువుల దత్తత వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కన్నతల్లి మృతిచెందాక పిల్లల సంరక్షణ బాధ్యత తండ్రిపై పడింది. అయితే, ఆయన నిస్సహాయతను ఆసరాగా చేసుకుని శిశువులను దత్తత పేరుతో విక్రయించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

తల్లి గంగజల మృతి :
వివరాల్లోకి వెళితే.. రాయికల్ మండలానికి చెందిన గంగజల కవల శిశువులకు జన్మనిచ్చింది. కొద్దికాలానికే ఆమె మృతిచెందింది. తల్లి ప్రేమను పొందకముందే కోల్పోయిన ఇద్దరు చిన్నారుల పోషణ బాధ్యత తండ్రి సాయిలుపై పడింది. ఆర్థిక పరిస్థితులు, పిల్లల సంరక్షణ భారంగా మారడంతో సాయిలు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు.

కానీ, ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న ఓ మహిళ పిల్లలను దత్తత ఇవ్వాలని తండ్రిని ఒప్పించినట్లు తెలిసింది. ఇద్దరు కవల శిశువులను రెండు వేర్వేరు కుటుంబాలకు దత్తత పేరుతో అప్పగించేలా ఒప్పందం కుదిర్చారు. ఇందుకు సంబంధించి డబ్బులు తీసుకున్నారనే ఫిర్యాదు పోలీసులకు అందినట్లు తెలుస్తోంది.

Read Also : KTR : షెల్ కంపెనీల బాగోతం బయటపెడతాం.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

ఈ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి రావడంతో తండ్రి సాయిలుతో పాటు పిల్లలను దత్తత తీసుకున్నట్లు చెబుతున్న రెండు కుటుంబాలు, నోటరీ చేసిన న్యాయవాదిపై రాయికల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పిల్లల దత్తత చట్టబద్ధంగా జరిగిందా? నిబంధనలు పాటించారా? డబ్బుల లావాదేవీలు జరిగాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దత్తత చట్ట ప్రకారమే జరగాలి :
అధికారుల ప్రకారం.. చిన్నారుల దత్తత ప్రక్రియ చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగానే జరగాలన్నారు. పిల్లల సంరక్షణ, భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏదిఏమైనా, తల్లిని కోల్పోయిన ఆ పసికందుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దత్తత వ్యవహారంలో అసలేం జరిగింది? విక్రయం, డబ్బుల లావాదేవీలు నిజమేనా? అనే ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.