neet 2020 : నీట్ 2020 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. హైదరాబాద్‌కు చెందిన తుమ్మల స్నిఖిత ఆలిండియా మూడో ర్యాంకు సాధించారు. రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించారు. టాప్ 15 జాతీయ ర్యాంకుల్లో రాష్ట్ర విద్యార్థులు ముగ్గురు ఉండగా, టాప్ 50 ర్యాంకుల్లో ఏకంగా ఏడుగురు ఉన్నారు.
ఆలిండియా ర్యాంకుల్లో బాలురు అగ్రస్థానంలో నిలిచారు. తొలి 50 ర్యాంకుల్లో 31 ర్యాంకులను బాలురే దక్కించుకున్నారు. రాష్ట్రం నుంచి నీట్‌లో అనంత పరాక్రమ (11వ ర్యాంకు), బారెడ్డి సాయి త్రిషా రెడ్డి (14వ ర్యాంకు), శ్రీరామ్ సాయి శాంతవర్ధన్ (27వ ర్యాంకు ), ఆర్షశ్ అగర్వాల్ (30వ ర్యాంకు), మల్లేడి రుషిత్ (33వ ర్యాంకు), ఆవుల సుభాంగ్ (38వ ర్యాంకు) సాధించారు.
బాలికల విభాగంలో తొలి 20 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన నిత్య దినేష్ (ఆలిండియా 58వ ర్యాంకు) 17వ స్థానాన్ని పొందారు. ఎయిమ్స్, జిప్‌మర్ సహా అన్ని ప్రముఖ మెడికల్ కాలేజీల్లోనూ ఈ ఏడాది నుంచి నీట్ ర్యాంకుల ప్రాతిపదికనే సీట్లను భర్తీ చేయనున్నారు.
ర్యాంకు సాధించడం పట్ల..స్నిఖిత సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చదువుతానని, మెడికల్ కోర్సు చేశాక ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నానని తెలిపారు.
తెలంగాణ నుంచి ఆలిండియా కోటాకు 467 ఎంబీబీఎస్ సీట్లు ఇస్తారు. ఆలిండియా కోటాలో రెండు విడతల ప్రవేశ ప్రక్రియల అనంతరం మిగిలిన సీట్లను రాష్ట్రాలకు ఇస్తారు. రాష్ట్ర ప్రవేశాలకు, అఖిల భారత వైద్యవిద్య సీట్ల కూటమి ప్రవేశాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రస్థాయిలో నిర్వహించే కన్వీనర్, మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల ప్రవేశాలను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భర్తీ చేస్తారు.