కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపికలో జాప్యం వెనుక అసలు మర్మం ఏంటి?

పీసీసీ చీఫ్ ఎంపిక విషయానికి మంత్రివర్గ విస్తరణకు లింక్ చేస్తున్నా.. నిజానికి ఈ రెండింటికి..

CM Revanth Reddy

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్ రెడ్డి గడువు ముగిసినా.. పార్టీ అధిష్టానం కొత్త వారికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు. పీసీసీ చీఫ్ విషయంలో రకరకాల పేర్లు తెర పైకి వచ్చిన మళ్లీ హోల్డ్ లో ఎందుకు పెట్టారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు.. మంత్రివర్గ విస్తరణకు ఏమైనా సంబంధం ఉందా..? అసలు పీసీసీ చీఫ్ నియామకంలో జరుగుతున్న జాప్యం వెనుక అసలు మర్మమేంటో? ఇప్పుడు చూద్దాం…

తెలంగాణ కొత్త పీసీపీ నియామకంలో జాప్యంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి మూడేళ్ల పదవీకాలం గత నెల 27తో ముగిసింది. రేవంత్‌రెడ్డి సీఎంగా ఉండటంతో ఆయన స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావించింది. అందులో భాగంగా పలువురు ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించుకొని మరీ చర్చోపచర్చలు జరిపింది.

సామాజిక సమీకరణాలను కూడా బేరీజు వేసుకొని అన్ని అంశాలను పరిశీలించింది. నెక్ట్స్‌ పీసీసీ చీఫ్‌ అంటూ ఒకరిద్దరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఆల్ అఫ్ సడెన్‌గా కొత్త అధ్యక్షుడి నియామకాన్ని హోల్డ్‌లో పెట్టేసింది కాంగ్రెస్‌ హైకమాండ్‌.

మంత్రివర్గ విస్తరణతో లింక్ పెడుతూ..
పీసీసీ చీఫ్‌ ఎంపికకు.. మంత్రివర్గ విస్తరణతో లింక్ పెడుతూ పార్టీలో బ్రేక్‌ వేశారని చర్చ మొదలైంది. మంత్రివర్గ విస్తరణ విషయంలో సామాజిక సమీకరణాలు కొలిక్కి రాకపోవడంతోనే వాయిదా వేసినట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.

అయితే పీసీసీ చీఫ్ ఎంపిక విషయానికి మంత్రివర్గ విస్తరణకు లింక్ చేస్తున్నా.. నిజానికి ఈ రెండింటికి అసలు సంబంధం లేదనే విశ్వసనీయ సమాచారం. మంత్రివర్గ విస్తరణను సాకుగా చూపి పీసీసీ చీఫ్‌ నియామకానికి బ్రేక్‌ వేశారని గాంధీభవన్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు కారణం వేరే ఉందట..

ప్రస్తుతం కాంగ్రెస్‌లో వలసల సీజన్ నడుస్తోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి హస్తం తీర్థం పుచ్చుకుంటున్నారు. ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఎమ్మెల్యేల జాయినింగ్స్ తప్పనిసరని.. పార్టీ అధిష్టానం కూడా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పుడు పీసీసీ చీఫ్, సీఎంగా రేవంత్ రెడ్డి ఉండటంతో వ్యవహారం సాఫీగా సాగుతోంది.

కొత్తవారిని నియమిస్తే?
ఒకవేళ పీసీసీ చీఫ్‌గా కొత్తవారిని నియమిస్తే… చేరికల విషయంలో గందరగోళం ఏర్పడుతుందనే అభిప్రాయంతోనే పీసీసీ చీఫ్‌ నియామకాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛతో కొత్త వారి చేరికలకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఒకటిరెండు చోట్ల చేరికలకు నిరసనగా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే కొత్తవారికి పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే.. మరింత గందరగోళం తలెత్తే అవకాశం ఉందనే ఆలోచనతోనే అధిష్టానం… కొత్త అధ్యక్షుడిగా ఎవరినీ నియమించకుండా హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

ఇంకా క్యూలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరిక కూడా సజావుగా పూర్తి చేసేవరకు సీఎం రేవంత్‌రెడ్డే పీసీసీ చీఫ్‌గా ఉండాలని అధిష్టానం సూచించిందని టాక్‌. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే.. బీఆర్ఎస్ శాసనసభ పక్షం విలీనం కావాల్సి ఉంది. ఇందుకోసం మరికొద్దిమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకోవాల్సివుంది. అందుకే ఆపరేషన్ కంప్లిట్ అయ్యేంత వరకు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా పీసీసీ అంశం హోల్డ్ లో పెట్టాలని పార్టీ అధిష్టానం డిసైడ్ అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు