ప్రేమికులకు, పార్కులకు మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ హైదరాబాద్ నగరంలోని కొన్ని పార్కుల్లో అయితే ప్రేమికులు రెచ్చిపోయి కనిపిస్తూ ఉంటారు. ప్రేమికులకు అడ్డాగా మారిన సంజీవయ్య పార్కు గురించి కచ్చితంగా చెప్పుకోవలసిందే.
ప్రేమికుల కారణంగా పార్క్ కు వచ్చే పెద్దవాళ్లు, ఫ్యామిలీలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో హెచ్‌ఎండీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేమికుల రాక వల్ల పార్కులోకి వచ్చే ఇతర సందర్శకులకు ఇబ్బందులు కలుగుతుండటంతో సంజీవయ్య పార్కుతో పాటు హెర్బల్ పార్కు, సీతాకోక చిలుకల పార్కు, రోజ్ గార్డెన్, జాతీయ జెండా తదితర ప్రాంతాలన్నింటినీ ‘సంజీవయ్య పిల్లల పార్క్’ పరిధిలోకి తీసుకుని వచ్చారు.
ఈ మేరకు సంస్థ కార్యదర్శి ఎం.రాంకిషన్ ఆదేశాలు జారీ చేశారు. 14ఏళ్ల లోపు పిల్లలు, వారి వెంట వచ్చే తల్లిదండ్రులు, సంరక్షకులకు మాత్రమే పార్క్ లోకి ప్రవేశం కల్పిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రవేశ రుసుంను రూ.20 నుంచి రూ.10కి తగ్గించి పిల్లల పార్క్ గా పూర్తిగా మార్చేశారు. ఉపాధ్యాయుల నేతృత్వంలో వచ్చే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ప్రకటించారు.
హుస్సేన్‌సాగర్ తీరాన గల సంజీవయ్య పార్కులో భారీ జాతీయ జెండాతో పాటు, రోజ్ గార్డెన్, బటర్ ప్లై పార్కు ఉన్నాయి. ఇక తెల్లవారుజామున 5.30గంటల నుంచి ఉదయం 8.30గంటల వరకు యథావిధిగా అన్నీ వయస్సుల వారికి వ్యాయామం కోసం మాత్రం ఉచిత ప్రవేశాన్ని కల్పించనున్నారు.
సంజీవయ్య పిల్లల పార్కు వేళలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే. ఇక పార్కులోకి పొగతాగడం, మద్యం, బయటి తినుబండారాలను అనుమతించకుండా చర్యలు తీసుకోనున్నారు.