Pawan Kalyan congratulates : దుబ్బాకలో బీజేపీ గెలుపుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు అభినందనలు తెలిపారు. బీజేపీపై, పార్టీ రాష్ట్ర నాయకత్వంపైన ప్రజల విశ్వాసానికి దుబ్బాకలో గెలుపే నిదర్శనమని భావిస్తున్నట్లు ప్రకటించారు. దుబ్బాక విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
రఘునందన్ వ్యక్తిత్వం, ప్రజాసేవలో చూపించే నిబద్ధత వల్లే ఆయనకు విజయ హారం దక్కిందని పవన్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో యువత విశేష సంఖ్యలో పాల్గొనడం శుభ పరిణామం అన్నారు. రాజకీయాలను సక్రమమార్గంలో నడిపించడం యువత వల్లే సాధ్యం అవుతుందని చెప్పారు.
బీజేపీని తెలంగాణ శాఖకు నాయకత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి దుబ్బాక ఉప ఎన్నికలో విజయం వరకు బండి సంజయ్ చూపించిన నాయకత్వ పటిమ పార్టీ విజయానికి మార్గం చూపిందన్నారు. బీజేపీలోని అన్ని వర్గాలను సమాయత్తం చేయడం ద్వారా ఆయన విజయం సాధించారని పేర్కొన్నారు.