Pawan Kalyan
Pawan Kalyan: ఏపీలో జగన్‌ను ఓడించిన జోష్‌లో..తెలంగాణలోనూ ఇటు కాంగ్రెస్..అటు బీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలని ఎప్పటినుంచో ఆశ పడుతున్నారు జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా..మున్సిపల్ ఎన్నికల నుంచే రాజకీయ సమరం మొదలుపెట్టాలనుకున్నారు. పురపాలక సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తామని బరిలోకి కూడా దిగారు. పలుచోట్ల జనసేన అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు.
అయితే పురపోరులో పోటీపై బీజేపీని సంప్రదించి నిర్ణయం తీసుకున్నారో లేక ఒంటరిగా పోటీ చేయాలనుకున్నారో తెలియదు కానీ..ఇప్పుడు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పవన్ ప్రచారానికి రాబోతున్నారు. లేటెస్ట్‌గా హైదరాబాద్‌లోని పవన్ నివాసంలో ఆయనను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కలిశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తమ అభ్యర్థుల గెలుపు కోసం క్యాంపెయిన్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. అందుకు ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 7, 8 తేదీల్లో పవన్ మున్సిపల్ ఎన్నికల క్యాంపెయిన్ చేయబోతున్నారు.
Also Read: కల్తీ నెయ్యి వ్యవహారంలో విచారణ కమిషన్‌ను వేయడం వెనుక కూటమి ప్లానేంటి?
అయితే పవన్ ఎవరిని గెలిపించాలని ఓటర్లకు పిలుపునివ్వబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బీజేపీ, జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నారు. పైగా చాలా చోట్ల ఈ రెండు పార్టీల క్యాండిడేట్ల మధ్య ఓట్ల చీలిక జరిగే అవకాశం ఉంది. అయితే బీజేపీతో అలయన్స్‌లో ఉన్న పవన్..తన పార్టీని ఒంటరిగా మున్సిపల్ ఎన్నికల బరిలోకి దించడం ఏంటి?
ఏయే ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారో?
బీజేపీ నేతల కోరిక మేరకు ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారానికి రావడమేంటన్న చర్చ జరుగుతోంది. పవన్ ఏయే ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు.? అక్కడ జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల పరిస్థితి ఏంటన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో బీజేపీ తరఫున ప్రచారం చేశారు. కానీ ఆయన ప్రచారంతో ఆశించిన ఫలితాలేవి రాలేదని అప్పట్లోనే కమలనాథులు చెవులు కోరుక్కున్నారు.
అంతేకాదు గత ఎన్నికల సమయంలో ఆయన ప్రచారన్ని కూడా వద్దనుకున్నారు. ఇప్పుడు బీజేపీ తరఫున పవన్ ప్రచారానికి వస్తుండటంతో..గతంలో తెలంగాణ ఏర్పాటును ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావనకు తెస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో బాధతో వారం రోజుల పాటు తిండి మానేశానని పవన్ చెప్పిన విషయాలను గుర్తు చేస్తున్నారు.
అంతేకాదు కోనసీమ కొబ్బరి పంటకు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందని లేటెస్ట్‌గా పవన్ చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పవన్ ప్రచారంతో బీజేపీకి జరిగే మేలెంతో..జనసేన తరఫున బరిలో నిలిచిన అభ్యర్థుల పరిస్థితి ఏంటో.? క్లారిటీ లేకుండా పోయింది.
పవన్‌పై విమర్శలు
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అయితే పవన్ ప్రచారంపై హాట్ కామెంట్స్ చేసి చర్చకు దారితీశారు. తెలంగాణ వ్యతిరేకి, ఆంధ్రా నాయకుడైన పవన్ చెప్తే ఎవరు ఓటేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నేతలు దేహీ అంటూ పవన్ను అడుక్కుంటున్నారని మండిపడ్డారు. గతంలో తెలంగాణ గురించి పవన్ నీచంగా మాట్లాడారని విమర్శించారు.
బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొడుతోందని సీరియస్ కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్. అయితే మహేష్ కుమార్‌గౌడ్ వ్యాఖ్యలకు మహబూబ్‌నగర్ సభలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు. కాంగ్రెస్సే మత విద్వేషాలను రెచ్చగొడుతోందని..కాంగ్రెస్ అంటే ముస్లిం..ముస్లిం అంటే కాంగ్రెస్ అని రేవంతే చెబుతున్నారని ఫైర్ అయ్యారు. మొత్తానికి పవన్ కల్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం సెంట్రిక్‌గా తెలంగాణ పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి.