Pawan Kalyan: తెలంగాణపై నా వైఖరి ఇదే.. పాత వీడియో షేర్ చేసిన పవన్ కళ్యాణ్.. వివాదానికి చెక్
తెలంగాణపై తన వైఖరిని తెలియజేస్తూ పాత వీడియోను షేర్ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan).
- V Santhosh Kumar
- Published on- June 4, 2026 / 07:20 PM IST
Pawan Kalyan Reaffirms His Stance on Section 8 and Supports Telangana Rights to Self Governance
- తెలంగాణపై పవన్ కల్యాణ్ మార్క్ క్లారిటీ
- ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సెక్షన్ ఎనిమిది వద్దు
- రెండు రాష్ట్రాలు సోదరభావంతో సాగాలి
Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణపై తనకున్న నిబద్ధతను, స్పష్టమైన వైఖరిని మరోసారి చాటిచెప్పారు. ఇటీవల తెలంగాణ రాజకీయాలపై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీయడంతో, ఆ పొలిటికల్ హీట్‌ను తగ్గించేందుకు ఆయన ఒక కీలక అడుగు ముందుకు వేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన హైదరాబాద్‌లోని ఉమ్మడి గవర్నర్ అధికారాల ‘సెక్షన్-8’ అమలుపై గతంలో తాను వ్యక్తం చేసిన సమతుల్యమైన అభిప్రాయాన్నే ఇప్పుడు కూడా బలంగా సమర్థిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు నాటి తన ప్రసంగానికి సంబంధించిన పాత వీడియోను ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ రాజకీయ చర్చకు తెరదించారు.
Supreme Court: వారికి ఉద్యోగాలు ఇస్తే అర్హులకు అన్యాయమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు
తెలంగాణ సమాజం ఎంతో పోరాడి సాధించుకున్న ఆత్మగౌరవాన్ని, వారి స్వయం పాలనా హక్కులను దెబ్బతీసే విధంగా సెక్షన్-8 అమలు ఉండకూడదని పవన్ కల్యాణ్(Pawan Kalyan) గట్టిగా గుర్తుచేశారు. విభజన నేపథ్యంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల ప్రజల భావోద్వేగాలను, ప్రయోజనాలను సమానంగా గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భద్రతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడం ఎంత ముఖ్యమో, అదే సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు కూడా అంతే సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాల పరిష్కారానికి కఠినమైన సెక్షన్ల కంటే, ప్రత్యేక సమన్వయ వ్యవస్థలు మరియు పరస్పర చర్చల ద్వారా ఏర్పడే అవగాహనతో కూడిన విధానాలే సరైనవని పవన్ పేర్కొన్నారు.
పార్లమెంటరీ పర్యవేక్షణతో పాటు రెండు రాష్ట్రాల మధ్య పరస్పర నమ్మకాన్ని పెంపొందించే చర్యలే దీర్ఘకాలిక శాంతికి మార్గం చూపుతాయని పవన్ కల్యాణ్ వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరిచే ఎలాంటి రాజకీయ వ్యూహాలకు తాను ఎప్పుడూ మద్దతు ఇవ్వబోనని ఈ సందర్భంగా ఆయన ఖచ్చితంగా తేల్చిచెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల హక్కులను, ప్రయోజనాలను కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణలు పరస్పర గౌరవం, శాంతి, సహకారం మరియు సోదరభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కలిసికట్టుగా పనిచేయడం ద్వారానే శాశ్వత పరిష్కారాలు సాధ్యమవుతాయని పవన్ కల్యాణ్ బల్లగుద్ది చెప్పారు.
