Hyderabad Traffic Alert: ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు అలర్ట్.. భారీగా ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!
ఖైరతాబాద్ మహాగణపతి భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు(Hyderabad Traffic Alert) కీలక నిర్ణయం తీసుకున్నారు.
- V Santhosh Kumar
- Updated on- September 11, 2026 / 08:51 PM IST
Police announce traffic diversions and parking locations for 'Khairatabad Ganesh'
- ఖైరతాబాద్ గణేష్ ట్రాఫిక్ ఆంక్షలు
- ఐదు చోట్ల వాహనాల మళ్లింపు
- ఆరు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు
Hyderabad Traffic Alert: గణేష్ పండుగ, హైదరాబాద్ నగరం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం, శోభాయాత్ర. ఈ ఏటా గణేష్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని, నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు హైదరాబాద్(Hyderabad Traffic Alert) ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు మార్గాల మళ్లింపుతో పాటు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయిస్తూ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ప్రధాన ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లు (Traffic Diversions):
ఖైరతాబాద్ పరిసరాల్లో వాహనాల రద్దీని నియంత్రించేందుకు ప్రధానంగా ఐదు పాయింట్ల వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ (D1), రాజ్‌దూత్ లైన్ (D2), మింట్ కాంపౌండ్ లైన్ (D3), నెక్‌లెస్ రోటరీ (D4), ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్ (D5) వద్ద వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు, సాధారణ వాహనదారులు ఈ మళ్లింపులను గమనించి అధికారులకు సహకరించాలని పోలీసులు సూచించారు.
భక్తుల కోసం కేటాయించిన పార్కింగ్ స్థలాలు (Parking Places):
భక్తుల వాహనాల నిలుపుదల కోసం ట్రాఫిక్ పోలీసులు ఆరు ప్రధాన పార్కింగ్ ప్రాంతాలను అందుబాటులోకి తెచ్చారు. రేస్ కోర్స్ రోడ్డు (P1), ఎన్టీఆర్ గార్డెన్ (P2), ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్‌ఎమ్‌డీఏ పార్కింగ్ (P3), ఐమాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం (P4), తెలంగాణ అమరుల స్మారక చిహ్నం ప్రాంతం (P5), విశ్వేశ్వరయ్య భవన్ (P6) లలో వాహనాలను పార్క్ చేసుకోవచ్చు. నిబంధనలు పాటించి కేటాయించిన స్థలాల్లోనే వాహనాలు నిలిపి ట్రాఫిక్ పురోగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
