Rahul Gandhi Bike Rally : డెలివరీ బాయ్స్‌కు గుడ్‌న్యూస్.. బీమా, పింఛన్, విశ్రాంతి కేంద్రాలు.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
Rahul Gandhi Bike Rally : హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల హక్కులు, సంక్షేమం కోసం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
- Harish Thanniru
- Updated on- November 14, 2026 / 12:40 PM IST
Rahul Gandhi
Rahul Gandhi Bike Rally : హైదరాబాద్ నగరంలో గిగ్ వర్కర్ల భారీ బైక్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. నగరంలోని హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త ప్రపంచ నిర్మాణం పేరిట భారత్ సమ్మిట్ సదస్సు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు నిర్వహించిన గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం అక్కడ జరిగిన సభలో రాహుల్ ప్రసంగించారు. గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు.
గిగ్ వర్కర్లతో కలిసి రెండు కిలోమీటర్లు ర్యాలీ అనంతరం జయభేరి మైదానంలో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. కొన్నిరోజుల కిందట తెలంగాణ గిగ్ వర్కర్లను కలిశాను. వారిని కలిసిన సమయంలో వారి బాధలను తెలుసుకున్నాను. అప్పుడు వారికి ఇచ్చిన మాటను ఇప్పుడు నెరవేర్చాను అని రాహుల్ గాంధీ అన్నారు. ఇన్నాళ్లు గిగ్ వర్కర్లకు ఎంత డబ్బు వస్తుందో తెలియని పరిస్థితి. గిగ్ వర్కర్ల చట్టంతో వర్కింగ్ అవర్స్, ఎంత డబ్బులు వచ్చాయో మొత్తం డేటా తెలుస్తుంది. గిగ్ వర్కర్లు రెస్ట్ తీసుకోవడానికి వైఫై ఉన్న ప్లేసులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గిగ్ వర్కర్ కు రూ.5లక్షల జీవిత బీమా, రూ.10లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. అంతేకాక.. గిగ్ వర్కర్ ప్రతి డెలివరీ జరిగిన వెంటనే ప్రతి రూపాయి అకౌంట్లో పడతాయని తెలిపారు.
డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, ఇతర ప్లాట్‌ఫామ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసని అన్నారు. వారి కష్టానికి తగిన గుర్తింపు, ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలకు తమ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.
దేశంలో ఇప్పటివరకు గిగ్ వర్కర్లకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో లేదని రాహుల్ అన్నారు. ఒక డెలివరీకి ఎంత సమయం పడుతోంది? దానికి ఎంత చెల్లిస్తున్నారు? అనే వివరాలు కూడా కార్మికులకు స్పష్టంగా తెలియడం లేదని పేర్కొన్నారు. కష్టపడేది కార్మికులే అయినప్పటికీ, వారి పనికి సంబంధించిన సమాచారం వారి చేతుల్లో ఉండటం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రతి డెలివరీకి సంబంధించిన చెల్లింపుల వివరాలు కార్మికులకు తెలిసేలా చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రతి డెలివరీ, రవాణా లావాదేవీపై ఒక శాతం మొత్తాన్ని గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి జమ చేసే విధానం గురించి వివరించారు.
ఎండలోనూ, వర్షంలోనూ మోటార్ సైకిళ్లపై తిరుగుతూ డెలివరీలు చేసే కార్మికులకు విశ్రాంతి తీసుకునేందుకు సరైన సదుపాయాలు ఉండటం లేదని రాహుల్ పేర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లోనూ గిగ్ వర్కర్ల కోసం విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. అనారోగ్యం, ప్రమాదాలు ఎదురైనప్పుడు కార్మికులకు బీమా రక్షణ కల్పించడంతోపాటు పింఛన్, ఇతర సంక్షేమ సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కార్మికుల పిల్లల చదువు, వారి ఆరోగ్యానికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తన ప్రసంగంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలపై కూడా రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఒకవైపు కార్మికులతో ఎక్కువ గంటలు పనిచేయించుకుని వారి శ్రమను దోచుకునే విధానం ఉందని ఆరోపించారు. మరోవైపు గిగ్ వర్కర్లను దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములుగా గుర్తించి, వారికి రక్షణ కల్పించాలనేది కాంగ్రెస్ ఆలోచన అని చెప్పారు. ప్రతి డెలివరీలో కార్మికులకు వాటా దక్కాలని, వారికి విశ్రాంతి, భద్రత, గౌరవం ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్లకు అండగా ఉంటుందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. చివరగా ‘జై హింద్.. జై తెలంగాణ’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
