సిట్టింగ్‌ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. ఏం జరుగుతోంది?

ఇద్దరు నేతల మధ్య జరుగుతోన్న పొలిటికల్ వార్ మాత్రం మానకొండూర్‌లో మంటలు రాజేస్తుంది.

మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ డైలాగులు పేల్చుతున్నారు లీడర్లు. ఆరోపణలు, సవాళ్ళతో మానకొండూర్ పాలిటిక్స్‌ హీటెక్కిపోతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ..అప్పర్ హ్యాండ్‌ సాధించేందుకు అస్త్రశస్త్రాలన్నింటినీ వాడేస్తున్నారట రసమయి.

ఎమ్మెల్యే కవ్వంపల్లి అవినీతిపరుడు అంటూ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. సీఎంఆర్‌ఎఫ్‌, ఆరోగ్యశ్రీ పథకాన్ని వాడుకుని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కోట్ల రూపాయలు దండుకుంటున్నారంటూ ఆరోపించారు రసమయి బాలకిషన్. ప్రతి పనికి కమీషన్‌ తీసుకుంటున్నారని అలిగేషన్స్ చేశారు.

రసమయి ఆరోపణలపై కవ్వంపల్లి సత్యనారాయణ..సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు. తప్పుడు ఆరోపణలు కాదు ఆధారాలుంటే బయట పెట్టాలంటూ ఎమ్మెల్యే ప్రతి సవాల్ చేస్తుంటే..బహిరంగ చర్చకు రావాలంటూ రసమయికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు ఎమ్మెల్యే అనుచరులు. అంతటి ఆగకుండా రసమయి ఫామ్ హౌజ్‌ను ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి.

క్యాంపు ఆఫీస్‌కు వస్తానంటూ సవాల్‌
రసమయి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆటలు, పాటలు తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదంటూ సెటైర్లు వేశారు కవ్వంపల్లి. ఎమ్మెల్యే మాటలకు, కాంగ్రెస్ శ్రేణులు విసిరిన సవాళ్లకు రసమయి ఘాటుగానే స్పందించారు. కమిషన్ల నారాయణ దమ్ముంటే చర్చకు రా…నీ క్యాంపు ఆఫీస్‌కు వస్తానంటూ సవాల్‌ విసిరారు రసమయి.

తాను చేసిన ఆరోపణలు తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ ముందు ముక్కు నేలకు రాస్తానంటూ కవ్వంపల్లితో బస్తీ మే సవాల్ అంటున్నారు రసమయి బాలకిషన్. ఇద్దరి మధ్య సవాళ్లు..ప్రతి సవాళ్ళతో మానకొండూర్‌ రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా హీటెక్కింది.

రసమయి… కవ్వంపల్లి ఇద్దరి మధ్య చాలాఏళ్లుగా కోల్డ్ వార్ నడుస్తోంది. రసమయి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కవ్వంపల్లి ఆరోపణలు చేస్తే…ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కవ్వంపల్లిపై రసమయి గళమెత్తుతున్నారు. ఇద్దరు నేతల మధ్య జరుగుతోన్న పొలిటికల్ వార్ మాత్రం మానకొండూర్‌లో మంటలు రాజేస్తుంది. అయితే మాటలు, సవాళ్లతోనే సరిపెడుతారా..ఆధారాలతో సహా బహిరంగ చర్చకు సిద్ధమవుతారో లేదో చూడాలి.