Hyderabad
Hyderabad: దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇక్కడ దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు జీవనం సాగిస్తుంటారు. ఉద్యోగ నిమిత్తం, వ్యాపార నిమిత్తం, ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వస్తున్నారు. వీరిలో చాలామంది ఇక్కడే సొంతింటి కోసం కొత్తగా ప్రారంభమయ్యే హౌసింగ్ ప్రాజెక్టులను ఆశ్రయించి.. తక్కువ ధర ఉన్న ప్రాజెక్టుల్లో ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఇదేతరహాలో ఇండ్లు కొనుగోలు చేసేందుకు చూస్తున్న వారికి రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కంపెనీ ప్రాప్ ఈక్విటీ షాకింగ్ విషయాన్ని చెప్పింది.
దేశంలోని టాప్ తొమ్మిది నగరాల్లో కొత్తగా ప్రారంభించిన గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో ఇళ్లు లేదా ప్లాట్ల సగటు ప్రారంభ ధర 2004-05లో 9శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.13,197కు చేరిందట. గతంలో.. అంటే 2023-24లో చదరపు అడుగుకు రూ.12.569గా ఉందని ప్రాప్ ఈక్విటీ సంస్థ పేర్కొంది. కొత్త ప్రాజెక్టుల్లో సగటు ఇళ్ల ధరలు కోల్ కతాలో గరిష్ఠంగా 29శాతం పెరగ్గా.. థానేలో 17శాతం, బెంగళూరులో 15శాతం, పుణెలో 10శాతం, ఢిల్లీ -ఎన్సీఆర్ లో 5శాతం, హైదరాబాద్ లో 5శాతం, చెన్నైలో 4శాతం ధరలు పెరిగాయి. ముంబయి, నవీ ముంబయిలో 3శాతం చొప్పున ధరలు తగ్గాయని ప్రాప్ ఈక్విటీ సంస్థ తెలిపింది.
ముడిసరుకుల ధరల పెరగడంతో పాటు, భూముల ధరలు పెరగడం కారణంగా కొత్త ప్రాజెక్టుల్లో ఇళ్లు, ప్లాట్ల ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. కొత్త ప్రాజెక్టుల్లో హైదరాబాద్ లో 2023-24లో చదరపు అడుగుకు 7,890 ఉండగా.. 2024-25లో 8,306కు పెరిగింది. బెంగళూరులో అయితే, 2023-24లో 8,577 ఉండగా.. 2024-25లో 9,852కు పెరిగింది. అయితే, నవీ ముంబైలో రేట్లు చదరపు అడుగుకు రూ. 13,286 నుంచి 12,855కు తగ్గాయి. ముంబైలోనూ అదే పరిస్థితి. అక్కడ చదరపు అడుగుకు రూ. 2023-24లో 35,215 ఉండగా.. ప్రస్తుతం 2024-25లో 34,026కు తగ్గిందని ప్రాప్ ఈక్విటీ పేర్కొంది.