HCU Deforestation : కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత..! బయటపెట్టిన శాటిలైట్ చిత్రాలు..!

పెట్టుబడులు, ఉపాధి సంగతి ఎలా ఉన్నా.. పర్యావరణానికి తీవ్రమైన నష్టం జరుగుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

HCU Deforestation : హైదరాబాద్ కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూముల వేలం వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారం రేపింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సమీపంలోని కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంతంలోని 400 ఎకరాల్లో చెట్లను నరికివేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై పెద్ద వివాదం నడుస్తోంది. పెద్ద సంఖ్యలో చెట్లను నరికేశారని విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు ఆరోపిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత నిజమేని ఆ శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

తెలంగాణలో ఐటీ పార్క్ కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో అటవీ నిర్మూలనను శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి. చెట్ల నరికివేత పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇది విద్యార్థుల నిరసనలకు దారితీసింది. కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని పర్యావరణానికి ప్రమాదం ఏర్పడటం సుప్రీంకోర్టు జోక్యానికి దారితీసింది.

గత వారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో ఐటీ పార్క్ ఏర్పాటు కోసం చాలా పెద్ద ప్రాంతంలోని చెట్లను నరికివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఉపగ్రహ చిత్రాలు విస్తృతమైన అటవీ నిర్మూలనను నిర్ధారిస్తున్నాయి. కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని హైదరాబాద్ నగరానికి ఉపిరితిత్తులుగా భావిస్తారు. అలాంటి చోట చెట్ల నరికివేతను ప్రకృతి ప్రేమికులు జీర్ణించుకోలేకపోతున్నారు.

అటవీ భూమి జియోస్పేషియల్ విశ్లేషణ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 మధ్య దాదాపు 2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న చెట్లు, వృక్ష సంపదను తొలగించినట్లు ఈ శాటిలైట్ చిత్రాల్లో చూడొచ్చు. రంగారెడ్డి జిల్లాలోని కంచ గచ్చిబౌలిలో క్లియరింగ్ ఆపరేషన్ కోసం దాదాపు 50 మట్టి తరలింపు యంత్రాలను మోహరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. యంత్రాలను గుర్తించిన వెంటనే నిరసనలు చెలరేగాయి. విద్యార్థులు ఆ ప్రాంతానికి చేరుకుని, బుల్డోజర్లపైకి ఎక్కారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, పర్యావరణవేత్తల నిరసనలతో హోరెత్తించారు. ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. తెలంగాణ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు 400 ఎకరాల భూమిలో క్లియరింగ్ ఆపరేషన్‌పై స్టే విధించాయి. కాగా.. అధికారిక ప్రకటనల ప్రకారం, ఐటీ ప్రాజెక్ట్ రూ. 50వేల కోట్ల వరకు పెట్టుబడులను ఆకర్షిస్తుందని, దాదాపు ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని భావిస్తున్నారు.

పెట్టుబడులు, ఉపాధి సంగతి ఎలా ఉన్నా.. పర్యావరణానికి తీవ్రమైన నష్టం జరుగుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై రాష్ట్రంలో రాజకీయ వివాదం చెలరేగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ సర్కార్ కి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం వెనక్కి తగ్గి తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే, హైదరాబాద్ ప్రజలతో కలిసి నిరసన ప్రదర్శన చేస్తామన్నారు. విద్యార్థుల నిరసనలకు తమ పార్టీ మద్దతు ప్రకటించారు. అంతేకాదు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న BRS తిరిగి అధికారంలోకి వస్తే భూమిని తిరిగి పొంది విశాలమైన ఎకో-పార్క్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్.

“మేము హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా మార్చాము. జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సంపాదించాము. గ్రీన్ కవర్ పెరుగుదలలో తెలంగాణ భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. మేము 270 కోట్ల మొక్కలను నాటాము. హైదరాబాద్ గ్రీన్ కవర్‌ను 7.7% పెంచాము” అని గత ప్రభుత్వ పర్యావరణ రికార్డును కేటీఆర్ సమర్థించారు.

పోలీసులు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణను విద్యార్థి సంఘాలు, పర్యావరణ ప్రేమికులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం పచ్చని ప్రదేశాల విధ్వంసాన్ని ఆపడానికి బలమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం, వెంటనే ఆ ప్రాంతంలో చెట్ల నరికివేతను ఆపేయాలని ఆదేశాలు ఇచ్చింది. 400 ఎకరాల భూమిలో ఉన్న చెట్లను రక్షించే చర్యలు తప్ప మిగతా అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తూ కఠినమైన ఉత్తర్వులు జారీ చేసింది.

పెద్ద ఎత్తున చెట్ల నరికివేతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తొందరపడటాన్ని ప్రశ్నించింది. భూమిని క్లియర్ చేయడానికి ముందు పర్యావరణ అనుమతులు పొందారా లేదా చెప్పాలని డిమాండ్ చేసింది.